Himachal Tragedy : 500 మీటర్ల లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఎనిమిది మంది పర్యాటకులు మృతి
Himachal Tragedy : హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 500 మీటర్ల లోతైన లోయలో పర్యాటకుల కారు పడిపోవడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు.
Himachal Tragedy
Himachal Tragedy : హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. పర్వత ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న ఒక పర్యాటకుల కారు అదుపుతప్పి ఏకంగా 500 మీటర్ల లోతైన ఘాట్ రోడ్డు లోయలోకి పడిపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది పర్యాటకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదం గురించిన సమాచారం శనివారం సాయంత్రం వరకు ఎవరికీ తెలియకపోవడం ఈ ఘటనలోని తీవ్రతను తెలియజేస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం ఈ కారు బ్యాగ్‌రాగఢ్ చెక్ పోస్ట్ నుంచి సచ్ పాస్ వైపు బయలుదేరింది. ఈ కారులో డ్రైవర్‌తో పాటు మొత్తం ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు, వీరిలో ఏడుగురు పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. అయితే, వారు వెళ్లిన కారు రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో పాటు, వారి ఫోన్లు కూడా కలవకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు శనివారం స్థానిక అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బైరాగఢ్ పోలీసులు శనివారం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కాలాబన్ పరిసర ప్రాంతాల్లోని ఘాట్ రోడ్డు పక్కన కారుకు సంబంధించిన కొన్ని విడిభాగాలు, శిథిలాలు పోలీసుల కంటపడ్డాయి. ఆ ప్రాంతంలో కిందికి నిశితంగా పరిశీలించగా.. దాదాపు 500 మీటర్ల లోతైన భారీ లోయలో కారు పూర్తిగా ధ్వంసమైన స్థితిలో పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
ప్రమాదం జరిగిన లోయ అత్యంత లోతుగా ఉండటం, దానికి తోడు అక్కడ వాతావరణం దారుణంగా మారడంతో శనివారం రాత్రికి మృతదేహాలను పైకి తీసుకురావడం రెస్క్యూ టీమ్‌కు సాధ్యపడలేదు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే హన్సరాజ్ ఈ విషయంపై మాట్లాడుతూ.. లోయ ప్రాంతంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల వల్ల శనివారం రెస్క్యూ ఆపరేషన్‌కు బ్రేక్ పడిందని, ఆదివారం ఉదయం నుంచి మళ్లీ మృతదేహాలను వెలికితీసే పనులు ముమ్మరం చేశామని తెలిపారు. కారులో ఉన్న ఎనిమిది మంది చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించినా, వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పర్వత ప్రాంతాల్లో ఉన్న మలుపులు, దట్టమైన పొగమంచు లేదా డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొండ ప్రాంతాలు, ఘాట్ రోడ్లపై ప్రయాణించే పర్యాటకులకు స్థానిక పరిపాలనా యంత్రాంగం కీలక సూచనలు చేసింది. వాతావరణం అనుకూలించనప్పుడు లేదా రాత్రి సమయాల్లో ఇలాంటి ప్రమాదకరమైన కొండ దారుల్లో ప్రయాణాలు పెట్టుకోవద్దని హెచ్చరించింది.




