Himanta Biswa Sarma: అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం

Himanta Biswa Sarma: అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ రెండోసారి బాధ్యతలు చేపట్టారు.

Arun Chilukuri
Published on: 12 May 2026 12:16 PM IST
Himanta Biswa Sarma
X

Himanta Biswa Sarma: అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం

Himanta Biswa Sarma: అస్సాం రాజకీయాల్లో హిమంత బిశ్వ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. గౌహతిలోని ఖానాపరా పశువైద్య కళాశాల ప్రాంగణంలో మంగళవారం జరిగిన అట్టహాసమైన వేడుకలో ఆయన వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రుల సమక్షంలో జరిగిన ఈ వేడుకతో అస్సాంలో మళ్లీ 'శర్మ శకం' మొదలైంది.

అస్సాం చరిత్రలో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తొలి కాంగ్రెసేతర నేతగా హిమంత బిశ్వ శర్మ రికార్డు సృష్టించారు. 126 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి ఏకంగా 102 సీట్లను కైవసం చేసుకుని ప్రతిపక్షాలను తుడిచిపెట్టేసింది. కాంగ్రెస్ కేవలం 19 సీట్లకే పరిమితం కావడంతో, అసెంబ్లీలో అధికారిక ప్రతిపక్ష హోదా పొందే అవకాశం కూడా ఏ పార్టీకి లభించని పరిస్థితి నెలకొంది.

మంగళవారం ఉదయం 11:40 గంటలకు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, శర్మతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ వంటి కేంద్ర మంత్రులు మరియు 22 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అస్సాంలోని 17 వైష్ణవ మఠాల మఠాధిపతుల ఆశీర్వాదాల మధ్య శర్మ తన పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ముఖ్యమంత్రితో పాటు అజంతా నియోగ్, రామేశ్వర్ తేలి, అతుల్ బోరా (ఏజీపీ), చరణ్ బోరో (బీపీఎఫ్‌)లు మంత్రులుగా ప్రమాణం చేశారు. సీనియర్ నాయకుడు రంజిత్ దాస్‌ను స్పీకర్‌గా ఎంపిక చేయనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story