LPG Tanker Blast: టోల్‌ప్లాజాను ఢీకొట్టిన గ్యాస్ ట్యాంకర్.. నలుగురు సజీవ దహనం!
LPG Tanker Blast: ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. షిహోరి టోల్ ప్లాజా వద్ద ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించి నలుగురు సజీవదహనమయ్యారు.
LPG Tanker Blast: టోల్‌ప్లాజాను ఢీకొట్టిన గ్యాస్ ట్యాంకర్.. నలుగురు సజీవ దహనం!
LPG Tanker Blast: ఉత్తరప్రదేశ్‌లో అత్యంత భయానక రోడ్డు ప్రమాదం సంభవించింది. కౌశాంబి జిల్లాలో ఒక ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ (LPG Tanker) అదుపుతప్పి టోల్ ప్లాజాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ట్యాంకర్ నుండి గ్యాస్ భారీగా లీకై, క్షణాల వ్యవధిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో టోల్ ప్లాజా పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్‌తో సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. తాజాగా ఇందుకు సంబంధించిన హృదయవిదారక సీసీటీవీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
పోలీసుల కథనం ప్రకారం.. కాన్పూర్ నుండి వారణాసి వైపు ఎల్పీజీ గ్యాస్ లోడ్‌తో రెండు ట్యాంకర్లు బయలుదేరాయి. కౌశాంబి జిల్లా కోక్‌రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షిహోరి టోల్ ప్లాజా వద్దకు ఈ వాహనాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో వెనుక వస్తున్న గ్యాస్ ట్యాంకర్ ఒక్కసారిగా అదుపు తప్పి టోల్ ప్లాజా ఫుట్‌పాత్‌ను, డివైడర్‌ను వేగంగా ఢీకొట్టింది.
ఢీకొట్టిన తీవ్రతకు ట్యాంకర్ వాల్వ్ విరిగిపోయి, లోపల ఉన్న ఎల్పీజీ గ్యాస్ విపరీతంగా లీక్ కావడం ప్రారంభమైంది. కేవలం కొన్ని సెకన్లలోనే తెల్లటి పొగమంచులా గ్యాస్ చుట్టుపక్కల వందలాది మీటర్ల మేర దట్టంగా కమ్మేసింది. టోల్ ప్లాజా సిబ్బంది, వాహనదారులు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే.. అక్కడ చిన్న నిప్పురవ్వ అంటుకుని ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.
ఈ పెను ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ ధర్మేంద్ర ద్వివేదితో పాటు టోల్ ప్లాజా వద్ద ఉన్న మరో ముగ్గురు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మంటల తీవ్రతకు షిహోరి టోల్ ప్లాజా క్యాబిన్లు, పరికరాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి.
అయితే, ఈ ప్రమాదంలో ఒక చిన్న ఊరట లభించింది. వారణాసి వెళ్తున్న మరో గ్యాస్ ట్యాంకర్ ఈ ప్రమాదం జరగడానికి కేవలం కొద్ది సెకన్ల ముందే టోల్ ప్లాజాను దాటి ముందుకు వెళ్లిపోయింది. ఒకవేళ ఆ ట్యాంకర్ కూడా అక్కడే ఉండి ఉంటే.. ప్రమాద తీవ్రత ఊహకందని విధంగా ఉండేదని, వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవరని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే కోక్‌రాజ్ పోలీసులు, అర డజనుకు పైగా ఫైర్ టెండర్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. గ్యాస్ లీకేజీ అవుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు మృతుల శేషాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి, ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.




