Madras High Court: భర్త వివాహేతర సంబంధం భార్యపై క్రూరత్వం కిందకు రాదు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు!

Madras High Court: భర్త వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఐపీసీ 498-ఏ కింద భార్యపై క్రూరత్వం కిందకు రాదని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

Arun Chilukuri
Published on: 24 Oct 2026 11:11 AM IST
Madras High Court
X

Madras High Court: భర్త వివాహేతర సంబంధం భార్యపై క్రూరత్వం కిందకు రాదు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు!

Madras High Court: భర్త వేరొక మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉండటం అనేది భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 498-ఏ కింద భార్యపై 'క్రూరత్వం' చూపడంగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బిడ్డతో సహా భార్య ఆత్మహత్య చేసుకున్న తీవ్రమైన ఘటనలో.. భర్తను విచారణ కోర్టు (Trial Court) నిర్దోషిగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

2008లో వివాహం చేసుకున్న ఒక దంపతుల మధ్య వివాహేతర సంబంధం, అదనపు వరకట్న వేధింపుల కారణంగా గొడవలు తలెత్తాయి. భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో పాటు ఏడాదిన్నర చిన్నారిని పట్టించుకోకపోవడం, తీవ్రంగా వేధించడంతో మనస్తాపానికి గురైన భార్య, తన బిడ్డతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. భర్తే ఆత్మహత్యకు ప్రేరేపించాడని, వరకట్నం కోసం చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపిస్తూ ఆ మహిళ సోదరుడు, ప్రభుత్వం కోర్టును ఆశ్రయించారు. అయితే, సరైన ఆధారాలు లేవనే కారణంతో ట్రయల్ కోర్టు భర్తను విడుదల చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీల్ దాఖలైంది.

ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సుందర్ మోహన్ ధర్మాసనం కీలకమైన తీర్పునిచ్చింది. ఈ కేసులో రెండో ప్రతివాది అయిన భర్తకు వివాహేతర సంబంధం ఉన్నట్లు రుజువైనప్పటికీ.. వాస్తవాల ప్రాతిపదికన ఆ సంబంధం నేరుగా భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించేంత స్వభావం కలదిగా భావించలేమని తెలిపింది.

ఐపీసీ సెక్షన్ 498-ఏ కింద క్రూరత్వ నేరాన్ని నిరూపించాలంటే కేవలం వివాహేతర సంబంధం ఉందనే ఒక్క కారణం సరిపోదని, భార్యను తీవ్రమైన మానసిక లేదా శారీరక వేధింపులకు గురిచేశారని ప్రభుత్వం తరఫున నిరూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసులో భర్త ప్రవర్తన ఆత్మహత్యకు ప్రేరేపించిందనడానికి తగిన సాక్ష్యాధారాలను ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయిందని పేర్కొంటూ మద్రాస్ హైకోర్టు ఆ అప్పీల్‌ను కొట్టివేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.