Hijack Threat: విమానం టాయిలెట్‌లో 'హైజాక్' బెదిరింపు లేఖ కలకలం.. బెంగళూరుకు తిరుగు ప్రయాణమైన ఇండిగో ఫ్లైట్!
IndiGo Flight Hijack Threat: బెంగళూరు-లక్నో ఇండిగో విమానం టాయిలెట్‌లో హైజాక్ బెదిరింపు లేఖ కలకలం రేపడంతో విమానాన్ని అత్యవసరంగా బెంగళూరుకు వెనక్కి మళ్లించారు.
Hijack Threat: విమానం టాయిలెట్‌లో 'హైజాక్' బెదిరింపు లేఖ కలకలం.. బెంగళూరుకు తిరుగు ప్రయాణమైన ఇండిగో ఫ్లైట్!
IndiGo Flight Hijack Threat: గాలిలో ప్రయాణిస్తున్న విమానంలో ఒక్కసారిగా హైజాక్ బెదిరింపు లేఖ లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. బెంగళూరు నుంచి లక్నో బయలుదేరిన ఇండిగో విమానంలోని టాయిలెట్‌లో చేతితో రాసిన నోట్ కనిపించడంతో, పైలట్లు ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని తిరిగి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు.
"విస్మరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి":
మొత్తం 178 మంది ప్రయాణికులతో సాయంత్రం 5:50 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరిన 6E451 ఇండిగో విమానం గాలిలో ఉండగా ఒక ప్రయాణికుడు టాయిలెట్‌కు వెళ్లాడు. అక్కడ అతనికి ఒక లేఖ కనిపించింది. "ఈ విమానం సరిగ్గా ఉదయం 06:30 గంటలకు హైజాక్ కాబోతోంది. దీనిని విస్మరిస్తే, పరిణామాలు చూడాల్సిందే" అని అందులో రాసి ఉంది. వెంటనే సదరు ప్రయాణికుడు విమాన సిబ్బందికి సమాచారం అందించాడు.
విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ:
పరిస్థితి తీవ్రతను గుర్తించిన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ను అప్రమత్తం చేసి విమానాన్ని బెంగళూరుకు తిప్పి తీసుకొచ్చారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వగానే టెర్మినల్-1 వద్ద అధికారులు పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితి (Full Emergency) ప్రకటించారు.
ప్రయాణికుల తనిఖీ & విచారణ:
♦ ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించి, భద్రతా బలగాలు విమానం మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి.
♦ లోపల ఉన్న ప్రయాణికులలో ఎవరైనా ఈ పని చేసి ఉండవచ్చని అనుమానించిన పోలీసులు, వారిని వేర్వేరుగా ప్రశ్నించినట్లు సమాచారం.
ఇండిగో స్పందన:
ప్రామాణిక భద్రతా నియమావళి (SOP) ప్రకారం అధికారులకు తక్షణమే సమాచారం అందించి, నిబంధనల మేరకు విమానాన్ని బయలుదేరిన స్థానానికే వెనక్కి తెచ్చామని ఇండిగో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ, వారికి అవసరమైన శీతల పానీయాలు మరియు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తున్నామని స్పష్టం చేసింది. భద్రతా విభాగాల నుంచి అనుమతి లభించిన తర్వాతే విమానం తిరిగి లక్నోకు బయలుదేరుతుందని అధికారులు వెల్లడించారు.




