Chirag Madan: నువ్వొద్దు.. నీ ఉద్యోగం వద్దు..రూ. 17 లక్షల జాబ్‌కు గుడ్ బై
IIT Delhi: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఐఐటీలో సీటు సాధించి, లక్షల జీతం వచ్చే ఉద్యోగం సంపాదించడం అంటే అది ఒక పెద్ద విజయం.
Chirag Madan
IIT Delhi: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఐఐటీలో సీటు సాధించి, లక్షల జీతం వచ్చే ఉద్యోగం సంపాదించడం అంటే అది ఒక పెద్ద విజయం. కానీ, ఆ విజయం మీ ప్రాణాలను, ప్రశాంతతను బలి తీసుకుంటుంటే? సరిగ్గా ఇదే ఆలోచించాడు ఐఐటీ ఢిల్లీ గ్రాడ్యుయేట్ చిరాగ్ మదాన్. కార్పొరేట్ ప్రపంచంలోని టాక్సిక్ సంస్కృతిని భరించలేక, చేతిలో ఉన్న భారీ జీతాన్ని వదులుకుని బయటకు వచ్చేశాడు.
తిండికి సమయం లేదు
చిరాగ్ ఒక ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలో పనిచేసేవాడు. అక్కడ అతడు ఎదుర్కొన్న పరిస్థితులు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.కేవలం 10 నుండి 15 నిమిషాల్లోనే లంచ్ ముగించాలని మేనేజ్మెంట్ ఒత్తిడి చేసేది. ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు ఉండాల్సిన ఆఫీసు సమయం.. రాత్రి 7 గంటల వరకు సాగేది. 5 రోజుల పని దినాలు కాస్తా, ఆరు రోజులకు మారాయి. ఆరోగ్యం బాలేకపోతే సెలవు అడిగితే వంద ప్రశ్నలు. హాస్పిటల్ బెడ్‌పై ఉన్నా పని చేయాలనే ధోరణి అక్కడ ఉండేదని చిరాగ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
టార్గెట్లు
సేల్స్ విభాగంలో ఉన్న చిరాగ్‌కు ఏకంగా రూ. 10 కోట్ల విలువైన డీల్స్ క్లోజ్ చేయాలని టార్గెట్లు ఇచ్చేవారు. అవి పూర్తి చేయకపోతే తీవ్రమైన మానసిక వేధింపులు ఉండేవని, ఇది తన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో వివరించాడు. డబ్బు వస్తుంది కానీ, ఆ డబ్బును అనుభవించే ఆరోగ్యం, సమయం ఉండటం లేదు అని ఆయన ఆవేదన నెటిజన్ల మనసు గెలుచుకుంది.
జీతం కంటే జీవితం ముఖ్యం
చిరాగ్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయానికి సోషల్ మీడియాలో భారీ మద్దతు లభిస్తోంది.లక్షల జీతం ఉన్నా ప్రశాంతత లేకపోతే ఆ జీవితం వ్యర్థం" అని ఒకరు కామెంట్ చేయగా..యువత ఇలాంటి టాక్సిక్ కల్చర్‌కు నో చెప్పాల్సిన సమయం వచ్చింది అని మరికొందరు మద్దతు తెలిపారు. చిరాగ్ ఉదంతం కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు. నేడు వేలాది మంది యువ ప్రొఫెషనల్స్ ఎదుర్కొంటున్న మానసిక వ్యధకు ఇది నిదర్శనం. కంపెనీలు తమ లాభాలను చూసుకోవడంలో తప్పులేదు కానీ, ఆ లాభాల కోసం ఉద్యోగులను యంత్రాల్లా చూడటం ఎంతవరకు సమంజసం? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.




