Independence Day 2026: ఎర్రకోటపై వందేమాతరం నినాదాలు.. ఆకాశం నుంచి పూల వర్షం.. 80వ స్వాతంత్య్ర వేడుకలు అదుర్స్

Independence Day 2026:భారతదేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 13వ సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

CR Reddy
Published on: 15 Aug 2026 6:55 AM IST
Independence Day 2026
X

Independence Day 2026

Independence Day 2026: దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవ శోభ ఉరిమేమురిసేలా విరాజిల్లుతోంది. జాతీయ గేయం వందేమాతరం రూపుదిద్దుకుని 150 ఏళ్లు పూర్తవుతున్న శుభతరుణంలో ఈసారి 80వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు సరికొత్త చారిత్రక ఘట్టానికి వేదికగా మారాయి. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 13వ సారి మువ్వన్నెల జెండాను ఆవిష్కరిస్తున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ అధికారుల సమక్షంలో త్రివిధ దళాలు, ఢిల్లీ పోలీసుల నుంచి ప్రధాని గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఈ చారిత్రక క్షణంలో ఎర్రకోట పరిసరాలు జాతీయ గీతంతో పాటు వందేమాతర నినాదాలతో ప్రతిధ్వనించడం విశేషం.

ఆకాశం నుంచి పూల వాన.. స్వదేశీ ఫిరంగుల మోత

జెండా ఆవిష్కరణ సమయం కళ్లారా చూసేందుకు రెండు కళ్లు చాలవనేలా ఆకర్షణీయ ఏర్పాట్లు చేశారు. కెప్టెన్ సోనియా చౌహాన్ నాయకత్వంలో జాతీయ జెండా ఎగురుతుండగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 105 ఎంఎం లైట్ గన్స్ నుంచి 21 తుపాకుల సెల్యూట్ సమర్పించనున్నారు. అదే క్షణంలో ఆర్మీ బ్యాండ్ వందేమాతరం గీతాన్ని ఆలపిస్తుండగా, ఎంఐ-17 హెలికాప్టర్లు ఆకాశం నుంచి వర్షంలా పూలవాన కురిపించనున్నాయి. ఒక హెలికాప్టర్‌పై త్రివర్ణ పతాకం, మరొకదానిపై 'వందేమాతరం' అక్షరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. జాతీయ భావాన్ని ఉప్పొంగించేలా ఈ దృశ్యాలు ప్రతీ భారతీయుడి గుండెల్లో దేశభక్తిని నింపనున్నాయి.

జ్ఞానపథంలో 2500 మంది కెడెట్ల అద్భుత దృశ్యం

ఎర్రకోట ప్రాంగణంలోని జ్ఞానపథ్‌లో సుమారు 2,500 మంది ఎన్‌సీసీ కెడెట్లు, మై భారత్ వాలంటీర్లు పాల్గొంటున్నారు. వీరంతా పైన చూస్తే వందేమాతరం అనే ఆకృతి స్పష్టంగా కనిపించేలా ప్రత్యేక వరుసల్లో కూర్చోవడం విశేషం. దీనికితోడు వికసిత్ భారత్ 2047 దృశ్యరూపాలు ఇక్కడ ప్రత్యేకంగా ఆకట్టుకోనున్నాయి. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చిన మహిళా పారిశ్రామికవేత్తలు, పారిశుధ్య కార్మికులు, వీధి వ్యాపారులు, యువ ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు, రైతులు, విద్యార్థులతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కలిపి దాదాపు 5,000 మంది విశిష్ట అతిథులు ఈ వేడుకలకు ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తున్నారు. రంగురంగుల సంప్రదాయ దుస్తుల్లో 1,500 మంది కళాకారులు భారతీయ సంస్కృతిని కళ్లముందు ఉంచబోతున్నారు.

ప్రజల కోసం ప్రత్యేక సౌకర్యాలు.. సరస్సుల పేర్లతో బ్లాకులు

వేడుకలకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ఢిల్లీ మెట్రో ఉదయం 4 గంటల నుంచే సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆహ్వానితులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. ఎర్రకోట ప్రాంగణంలో అతిథులు కూర్చునే స్థలాలకు భారతదేశంలోని ప్రసిద్ధ సరస్సులైన చిల్కా, దాల్, పాంగోంగ్ త్సో, పుష్కర్, వులర్ వంటి పేర్లు పెట్టడం విశేషం. దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు, హెల్ప్‌డెస్కులు, 200 మందికి పైగా వాలంటీర్లు సహాయక చర్యల్లో ఉన్నారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత ఎన్‌సీసీ కెడెట్లు పరిసరాలను శుభ్రం చేసే స్వచ్ఛత అభియాన్ చేపట్టనున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story