Independence Day 2026: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కీలక మార్పు.. ఎనిమిది దశాబ్దాల ఎర్రకోట చరిత్ర ఎందుకు మారబోతోంది?

Independence Day 2026: ఈ ఏడాది భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కీలక మార్పు చోటుచేసుకోనుంది.

Rishvik
Updated on: 11 Aug 2026 10:16 PM IST
Independence Day 2026
X

Independence Day 2026: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కీలక మార్పు.. ఎనిమిది దశాబ్దాల ఎర్రకోట చరిత్ర ఎందుకు మారబోతోంది?

Independence Day 2026: ఈ ఏడాది భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కీలక మార్పు చోటుచేసుకోనుంది. దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా ఢిల్లీలోని ఎర్రకోటపై జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమం ఈసారి ఒక అపూర్వమైన ఘట్టానికి సాక్ష్యంగా నిలవబోతోంది. 2026 ఆగస్టు 15న భారతదేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో.. ఈసారి ‘జనగణమన’కు ముందు ‘వందేమాతరం’ను ఆలపించనున్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో భాగంగా తొలిసారిగా జాతీయ గేయం 'వందేమాతరం'ను ఎర్రకోట వద్ద ఆలపించనున్నారు. ఆ తర్వాత జాతీయ గీతం, అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం ఉంటుందని రక్షణ శాఖ వెల్లడించింది. ఈ మార్పుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇన్నాళ్లూ ఎర్రకోట వేడుకల్లో ‘జనగణమన’కు ముందు ‘వందేమాతరం’ ఎందుకు వినిపించలేదు?.. ఇప్పుడు ఆలపించాల్సిన అవసరం ఏమొచ్చింది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈసారి ఎర్రకోట వద్ద జరిగే ‘వందేమాతరం’ గీతాలాపన సమయంలో ప్రముఖులు, విద్యార్థులు, ఆహ్వానిత అతిథులు సహా 27 వేల మందికి పైగా పాల్గొననున్నట్లు సమాచారం. ఈ రెండు దేశభక్తి గీతాలకు ఉన్న చారిత్రక, రాజ్యాంగపరమైన ప్రత్యేకతలు వేర్వేరు. ‘జనగణమన’ను 1950 జనవరి 24న రాజ్యాంగ సభ జాతీయ గీతంగా స్వీకరించింది. అధికారిక ప్రభుత్వ కార్యక్రమాల్లో జాతీయ గీతాన్ని నిర్దిష్ట ప్రోటోకాల్ ప్రకారం ఆలపిస్తారు. దేశ అధికారిక కార్యక్రమాల్లో ‘జనగణమన’కు ప్రత్యేకమైన స్థానం ఉంది. మరోవైపు ‘వందేమాతరం’కు స్వాతంత్ర్యోద్యమంతో ఎంతో అనుబంధం ఉంది. బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ 1870లలో దీనిని రచించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర్య పోరాటంలో ‘వందేమాతరం’ ఒక శక్తివంతమైన నినాదంగా మారింది. విప్లవకారులు, కాంగ్రెస్ కార్యకర్తలు, విద్యార్థులు, సామాన్య ప్రజలు దీనిని మాతృభూమిపై తమ ప్రేమను వ్యక్తం చేసే గీతంగా ఆలపించారు. 1950లో ‘వందేమాతరం’ను జాతీయ గీతంగా గుర్తించారు. అయితే అధికారికంగా ప్రజా కార్యక్రమాల్లో ఉపయోగించేందుకు ప్రధానంగా మొదటి రెండు చరణాలకే ప్రాధాన్యం ఉంది.

సాధారణంగా ఎర్రకోట స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కార్యక్రమం ఇన్నేళ్ళుగా ఒకేలా ఉంది. ప్రధాని ఎర్రకోటకు చేరుకోవడం, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం, జాతీయ గీతాన్ని ఆలపించడం, ఆ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. అయితే ‘వందేమాతరం’ను ఈ కార్యక్రమంలో భాగంగా చేర్చకూడదనే నిబంధన ఇంతకుముందు ఎక్కడా లేదు. కేవలం సంప్రదాయ కార్యక్రమంలో భాగం కాలేదు. అయితే 2026లో ఇన్నేళ్ల చరిత్రను మార్చి ‘వందేమాతరం’కు మొదటి స్థానాన్ని కల్పిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ రెండు గీతాలకు ఉన్న భిన్నమైన చారిత్రకతనే. ‘వందేమాతరం’ భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రతీకగా నిలిస్తే.. ‘జనగణమన’ స్వాతంత్ర్యం అనంతరం ఏర్పడిన సార్వభౌమ భారత గణతంత్రానికి అధికారిక స్వరంగా నిలుస్తోంది. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించిన గేయం ‘వందేమాతరం’. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధమైన భారత గణతంత్రాన్ని ప్రతిబింబించే జాతీయ గీతం ‘జనగణమన’. అందుకే ఈసారి కార్యక్రమంలో ముందుగా ‘వందేమాతరం’, ఆ తర్వాత ‘జనగణమన’ ఉండటం వెనుక ఒక చారిత్రక, ప్రతీకాత్మక సందేశం ఉంది.

అంతేకాదు ‘వందేమాతరం’ రూపుదిద్దుకుని 2026 నాటికి 150 సంవత్సరాలు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా అమర గీత వారసత్వానికి, ప్రాముఖ్యతకు ఘన నివాళిగా ఎర్రకోట నుంచి ఆలపించాలని నిర్ణయించారు. జాతీయ గీతం ‘జనగణమన’తో సమానంగా వందేమాతరానికి గౌరవం దక్కాలని, మొత్తం ఆరు చరణాలను ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం చాటి చెబుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, ర్యాలీలు, ఉద్యమాలు, రాజకీయ కార్యక్రమాల్లో ‘వందేమాతరం’కు ప్రత్యేక స్థానం ఉండేది. అప్పటికి భారత్‌కు రాజ్యాంగం, పార్లమెంట్, గణతంత్ర వ్యవస్థ లేదా ప్రస్తుత జాతీయ గీతం ఏదీ లేదు. స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలను ఏకం చేసిన భావోద్వేగ గేయంగా ‘వందేమాతరం’ నిలిచింది. ‘జనగణమన’ స్వతంత్ర భారతదేశం అధికారికంగా తనను తాను ప్రతిబింబించుకునే జాతీయ గీతంగా మారింది. ఈ నేపథ్యంలో ‘వందేమాతరం’ను ముందుగా ఆలపించనున్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story