Bullet Train:2027 నుంచి భారత్‌లో బుల్లెట్ ట్రైన్.. మొదట ఏ రూట్‌లో నడుస్తుందో తెలుసా?
Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలు సర్వీసులు 2027 చివరి త్రైమాసికంలో ప్రారంభమవుతాయని, మొదట సూరత్-వాపి సెక్షన్ తెరుచుకుంటుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించగా, ఆ తర్వాత దశలవారీగా ముంబై వరకు పూర్తి కారిడార్ అందుబాటులోకి వస్తుంది.
Bullet Train:2027 నుంచి భారత్‌లో బుల్లెట్ ట్రైన్.. మొదట ఏ రూట్‌లో నడుస్తుందో తెలుసా?
Bullet Train: భారత్‌కు కొన్నేళ్లుగా ఉన్న బుల్లెట్ ట్రైన్ కల సాకారమయ్యే సమయం దగ్గరపడింది. దేశంలో తొలి బుల్లెట్ రైలు సర్వీసులు 2027 నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తొలుత ముంబై-వాపి మధ్య రైలు సేవలను ప్రారంభిస్తామని తెలిపారు. ఆ తర్వాత దశలవారీగా పూర్తి కారిడార్‌ను నిర్మిస్తామని చెప్పారు.
శుక్రవారం తన సబ్‌స్టాక్ బ్లాగ్‌లో చేసిన పోస్టులో మంత్రి ఈ వివరాలు పంచుకున్నారు. దేశంలో తొలి హై-స్పీడ్ రైలు సర్వీస్ 2027లో మొదలవుతుందని, మొదట తెరుచుకునే సెక్షన్ సూరత్ నుంచి వాపి వరకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ముంబైకి వెళ్లే పూర్తి కారిడార్ దశలవారీగా అందుబాటులోకి వస్తుంది. సర్వీస్ 2027 చివరి త్రైమాసికంలో మొదలవుతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
సెప్టెంబర్ నాటికి 456 కిలోమీటర్ల మేర పిల్లర్ పనులు పూర్తయ్యాయి. 371 కిలోమీటర్ల మేర వయాడక్ట్ నిర్మాణం పూర్తయింది. 299 కిలోమీటర్ల మార్గంలో 6 లక్షల నాయిస్ బారియర్లు ఏర్పాటు చేశారు. 206 కిలోమీటర్ల వయాడక్ట్‌పై 9,300 విద్యుదీకరణ మాస్ట్‌లు అమర్చారు. మహారాష్ట్రలోని 21 కిలోమీటర్ల సొరంగంలో 5 కిలోమీటర్లు తవ్వారు. నాలుగు పర్వత సొరంగాల తవ్వకం పూర్తయింది. సబర్మతి, సూరత్, థానేలలో మూడు రోలింగ్ స్టాక్ డిపోల పనులు కొనసాగుతున్నాయి.
బీ28 రైలును ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) సంస్థలు సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతోంది. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా దీన్ని డిజైన్ చేశారు. మొదటి బాడీ ఫ్రేమ్ పూర్తయి, నిర్మాణ పరీక్షల దశలో ఉందని మంత్రి తెలిపారు. 2027 మధ్య నాటికి ట్రాక్ ట్రయల్స్ జరుగుతాయని ఆశిస్తున్నారు. ఆ తర్వాత గంటకు 350 కిలోమీటర్ల వేగం సామర్థ్యం ఉన్న బీ35 రైలు వస్తుందని కూడా ఆయన చెప్పారు.
ఈ రైలు 202 మీటర్ల పొడవు ఉంటుంది. 8 కోచ్‌లతో ఒకేసారి 557 మంది ప్రయాణించవచ్చు. దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక సదుపాయాలతో బోగీలను రూపొందించారు. ముంబై-అహ్మదాబాద్ కారిడార్ మొత్తం 508 కిలోమీటర్లు. పూర్తి కారిడార్ అందుబాటులోకి వచ్చాక ముంబై నుంచి అహ్మదాబాద్‌కు 2 గంటల 7 నిమిషాల్లో చేరుకోవచ్చని మంత్రి గతంలో చెప్పారు. 2028 నాటికి థానే-అహ్మదాబాద్ సెక్షన్, 2029 నాటికి పూర్తి ముంబై-అహ్మదాబాద్ మార్గం ప్రారంభమవుతాయని ఆయన అంచనా వేశారు




