Jobs in India : భారత ఆర్థిక వ్యవస్థకు మైనింగ్ బూస్ట్.. 2.5 కోట్ల కొత్త ఉద్యోగాలు.!
Jobs in India : భారతదేశం వికసిత భారత్‌గా ఎదిగే క్రమంలో మైనింగ్ (గనుల) రంగం వెన్నుముకగా నిలవబోతోంది. రాబోయే దశాబ్దాల్లో దేశ ముఖచిత్రాన్ని మార్చేసే శక్తి
Mining industry
Jobs in India : భారతదేశం వికసిత భారత్‌గా ఎదిగే క్రమంలో మైనింగ్ (గనుల) రంగం వెన్నుముకగా నిలవబోతోంది. రాబోయే దశాబ్దాల్లో దేశ ముఖచిత్రాన్ని మార్చేసే శక్తి ఈ రంగానికి ఉందని డెలాయిట్-ఐసీసీ (Deloitte-ICC) సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక స్పష్టం చేసింది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం ఏకంగా 500 బిలియన్ డాలర్ల (సుమారు రూ.41 లక్షల కోట్లు) అదనపు ఆదాయాన్ని సమకూర్చే అవకాశం ఉందని ఈ రిపోర్ట్ అంచనా వేసింది.
ఉపాధి కల్పనలో మైనింగ్ విప్లవం
ఆర్థిక వృద్ధితో పాటు నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కూడా మైనింగ్ రంగం కీలక పాత్ర పోషించనుంది. రాబోయే కాలంలో ఈ రంగం ద్వారా ప్రత్యక్షంగా , పరోక్షంగా సుమారు 2.5 కోట్ల (25 మిలియన్ల) కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని డెలాయిట్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశ జీడీపీలో మైనింగ్ రంగం వాటా కేవలం 2 నుంచి 3 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, ఉక్కు, సిమెంట్, విద్యుత్, ఆటోమొబైల్ వంటి కీలక పరిశ్రమలు దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే మైనింగ్ రంగం అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుంది.
మైనింగ్ 5.0.. టెక్నాలజీతోనే మార్పు
"మైనింగ్ 5.0 - ఎమర్జింగ్ మైనింగ్ టెక్నాలజీస్ బై 2030" పేరుతో వెలువడిన ఈ నివేదిక, పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలని సూచించింది. కేవలం ఆటోమేషన్ , డిజిటలైజేషన్‌కే పరిమితమైన పాత తరం 'మైనింగ్ 4.0' విధానం ఇప్పుడు సరిపోదని, దాని స్థానంలో "మైనింగ్ 5.0"ను స్వీకరించాలని నివేదిక తేల్చిచెప్పింది. ఇందులో భాగంగా:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ ట్విన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలను వాడాలి. డేటా అనలిటిక్స్ ఆధారంగా ఏకీకృత నిర్ణయ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. కేవలం తవ్వకాల పరిమాణం మీద కాకుండా, నాణ్యత, సుస్థిరత , మానవ కేంద్రక విధానాలపై దృష్టి సారించాలి.
ఇంటిగ్రేషన్ లేకుంటే పెట్టుబడులు వృధా
ప్రస్తుతం చాలా భారతీయ మైనింగ్ కంపెనీలు డిజిటల్ టెక్నాలజీని వాడుతున్నప్పటికీ, ఆ విధానాలు ముక్కలు ముక్కలుగా ఉన్నాయని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ప్లానింగ్, ప్రొడక్షన్, లాజిస్టిక్స్, మెయింటెనెన్స్ , భద్రత వంటి అన్ని విభాగాలను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురాకపోతే, డిజిటల్ రంగంలో చేసే పెట్టుబడులు ఆశించిన ఫలితాలను ఇవ్వవని డెలాయిట్ హెచ్చరించింది. భవిష్యత్తులో ఇంధన భద్రత , సుస్థిర ప్రగతిని సాధించాలంటే అన్ని విభాగాల సమన్వయం (Integration) అత్యంత అవసరమని నివేదిక వివరించింది.




