మరణశిక్షల రద్దుకు భారత్ నో.. ఐరాసలో కీలక ఓటింగ్

అంతర్జాతీయ వేదికపై మరణశిక్షల అమలు విషయంలో భారతదేశం తన స్పష్టమైన వైఖరిని మరోసారి చాటుకుంది. ప్రపంచవ్యాప్తంగా మరణశిక్షల అమలుపై..

G Krishna
Published on: 15 Nov 2026 1:01 PM IST
Death Penalty Moratorium
X

Death Penalty Moratorium

అంతర్జాతీయ వేదికపై మరణశిక్షల అమలు విషయంలో భారతదేశం తన స్పష్టమైన వైఖరిని మరోసారి చాటుకుంది. ప్రపంచవ్యాప్తంగా మరణశిక్షల అమలుపై తాత్కాలిక నిషేధం (మారటోరియం) విధించాలంటూ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. శుక్రవారం జరిగిన ఈ కీలక ఓటింగ్‌లో మెక్సికో ప్రవేశపెట్టిన తీర్మానానికి 133 దేశాలు మద్దతు తెలపడంతో అది ఆమోదం పొందింది. అయితే, భారతదేశంతో పాటు అమెరికా, చైనా, పాకిస్తాన్ సహా మొత్తం 33 దేశాలు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా, 16 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

సొంత చట్టాల హక్కును సమర్థించుకున్న 33 దేశాలు

మరణశిక్షను క్రమంగా రద్దు చేసే దిశగా అన్ని దేశాలు అడుగులు వేయాలనే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి ఈ తీర్మానాన్ని తీసుకొచ్చింది. ప్రతి దేశానికి తన సొంత న్యాయ వ్యవస్థను, చట్టాలను రూపొందించుకుని శిక్షలను నిర్ణయించుకునే సార్వభౌమ హక్కు ఉందని తీర్మానం అంగీకరించినప్పటికీ, మరణశిక్షలను నిషేధించాలని , ఇప్పటికే రద్దు చేసిన దేశాలు దానిని తిరిగి ప్రవేశపెట్టవద్దని విజ్ఞప్తి చేసింది. అయితే ఈ ప్రతిపాదనను భారత్, అమెరికా, చైనా, పాకిస్తాన్‌లతో పాటు జపాన్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, బహ్రెయిన్, కువైట్, మాల్దీవులు, ఒమన్, ఖతార్ వంటి దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తీవ్రమైన నేరాల నియంత్రణకు , దేశ భద్రతకు సంబంధించిన చట్టపరమైన అంశాల్లో అంతర్జాతీయ జోక్యాన్ని ఈ దేశాలు అంగీకరించలేదు.

మైనర్లు, గర్భిణీ స్త్రీలకు మినహాయింపు ఇవ్వాలని పిలుపు

ఆమోదం పొందిన ఈ తీర్మానంలో మానవతా దృక్పథంతో కూడిన పలు కీలక సూచనలను ఐక్యరాజ్యసమితి పొందుపరిచింది. నేరం జరిగిన సమయంలో 18 ఏళ్ల లోపు వయసు ఉన్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మరణశిక్ష విధించకూడదని, ఒకవేళ నిందితుడి వయస్సును నిర్ధారించడం సాధ్యం కాకపోయినా ఉరిశిక్షను నివారించాలని కోరింది. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు, మానసిక లేదా మేధోపరమైన వైకల్యాలు ఉన్నవారు , వృద్ధులను మరణశిక్ష పరిధి నుంచి పూర్తిగా మినహాయించాలని పిలుపునిచ్చింది. ఏదైనా నేరానికి మరణశిక్షను తప్పనిసరి చేసే చట్టపరమైన నిబంధనలను తొలగించి, ఉరిశిక్ష విధించే నేరాల సంఖ్యను తగ్గించాలని డిమాండ్ చేసింది.

2025లో పెరిగిన ఉరితీతలపై ఐరాస ఆందోళన

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు మరణశిక్ష వినియోగాన్ని తగ్గించే దిశగా ప్రయత్నిస్తున్నప్పటికీ, 2025వ సంవత్సరంలో నమోదైన ఉరిశిక్షల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపించడం పట్ల ఐక్యరాజ్యసమితి ఈ తీర్మానంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మరణశిక్షల అమలును నిలిపివేయడం ద్వారా మానవ హక్కులను కాపాడాలని సభ్య దేశాలకు పిలుపునిచ్చింది. అయినప్పటికీ, అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే ఉరిశిక్షను అమలు చేసే విధానాన్ని అనుసరిస్తున్న భారత్, తన దేశీయ చట్టాలకు కట్టుబడి ఈ తీర్మానాన్ని వ్యతిరేకించింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.