ఐరాసలో పాక్‌కు భారత్ షాక్.. కార్గిల్ నిజాలు గుర్తుచేసి కౌంటర్.!
మత స్వేచ్ఛ, మైనారిటీ హక్కులు, అంత్యక్రియల హక్కులపై భారత్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయాలని చూసిన పాకిస్థాన్‌కు ఐక్యరాజ్యసమితి (యుఎన్)..
India Pakistan UN
మత స్వేచ్ఛ, మైనారిటీ హక్కులు, అంత్యక్రియల హక్కులపై భారత్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయాలని చూసిన పాకిస్థాన్‌కు ఐక్యరాజ్యసమితి (యుఎన్) వేదికగా భారత్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. మత విశ్వాసాలు, మానవ హక్కుల గురించి మాట్లాడే అర్హత పాకిస్థాన్‌కు ఎంతమాత్రం లేదని భారత దౌత్యవేత్తలు స్పష్టం చేశారు. సొంత దేశంలోని మైనారిటీల ఉనికినే ముప్పులోకి నెట్టిన ఒక దేశం, భారతదేశానికి హితోపదేశం చేయడం విడ్డూరంగా ఉందని ఐరాసలో భారత తొలి కార్యదర్శి భావిక మంగళానందన్ కఠిన పదజాలంతో ఎండగట్టారు.
కార్గిల్ సైనికుల మృతదేహాలనే నిరాకరించిన దేశం పాక్
అంత్యక్రియల హక్కులు , మత స్వేచ్ఛపై ఐరాస ప్రత్యేక ప్రతినిధితో జరిగిన చర్చా కార్యక్రమంలో భావిక మంగళానందన్ చారిత్రక నిజాలను గుర్తుచేశారు. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో వీరమరణం పొందిన సొంత పాకిస్థాన్ సైనికుల మృతదేహాలను కూడా స్వీకరించడానికి పాక్ ప్రభుత్వం నిరాకరించిందని ఆమె ఎత్తిచూపారు. ఆ సమయంలో భారత సైన్యమే మానవతా దృక్పథంతో, అత్యంత గౌరవంగా పూర్తి ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం, సైనిక లాంఛనాలతో ఆ పాక్ సైనికులకు అంత్యక్రియలు నిర్వహించిందని గుర్తుచేశారు. ఈ చారిత్రక వాస్తవాలను ప్రత్యేక ప్రతినిధి తన నివేదికలో చేర్చకపోవడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై దృష్టి పెట్టండి
జమ్మూ కశ్మీర్ అంతర్గత వ్యవహారాల్లో అనవసరంగా వేలు పెట్టడం పాకిస్థాన్ తక్షణమే మానుకోవాలని భారత ప్రతినిధి హెచ్చరించారు. వేరే దేశాల గురించి మాట్లాడే ముందు, పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ (PoJK) లో జరుగుతున్న అణచివేత , మానవ హక్కుల ఉల్లంఘనలపై పాకిస్థాన్ దృష్టి సారిస్తే మంచిదని హితవు పలికారు. పాకిస్థాన్‌లో రోజురోజుకూ మైనారిటీల జనాభా తగ్గిపోతోందని, అక్కడ మైనారిటీ సమాజాలపై నిరంతరం దాడులు, అక్రమ మతమార్పిడులు జరుగుతున్నాయని ఆరోపించారు. సొంత పౌరుల ప్రాథమిక హక్కులను కూడా కాపాడలేని పాకిస్థాన్‌కు ప్రపంచ దేశాలకు సలహాలు ఇచ్చే అర్హత లేదని తెగేసి చెప్పారు.
ఉగ్రవాదుల హక్కులే ముఖ్యమా? బాధితుల సంగతేంటి?
ఐరాస ప్రత్యేక ప్రతినిధి నివేదికలోని పక్షపాత వైఖరిని కూడా భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. కోవిడ్ మహమ్మారి సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో జరిగిన వివక్ష, లోపాలను నివేదికలో ఎందుకు పొందుపరచలేదని భావిక ప్రశ్నించారు. అంతేకాకుండా, ఉగ్రవాదుల అంత్యక్రియల హక్కుల గురించి మాట్లాడే నివేదికలు.. ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక బాధితుల హక్కులకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల బాధలను వేదికలుగా వాడుకోవడం తగదని, అమాయకుల ప్రాణాలు తీసే ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపడం సరికాదని భారత్ ఐరాసలో గట్టిగా స్పష్టం చేసింది.




