IDME fuel: LPG కష్టాలకు చెక్.. రంగంలోకి భారత్ సొంత గ్యాస్!

పెరుగుతున్న ఎల్‌పీజీ (LPG) ధరలకు చెక్ పెట్టేందుకు భారత్ సరికొత్త 'DME' ఇంధనాన్ని సిద్ధం చేస్తోంది. పాత స్టవ్, సిలిండర్ మార్చాల్సిన అవసరం లేకుండానే ఈ స్వదేశీ గ్యాస్‌ను ఎలా వాడుకోవచ్చో ఈ స్టోరీలో చూడండి.

Ganesh
Updated on: 16 March 2026 3:17 PM IST
IndiaIDME fuel: LPG కష్టాలకు చెక్.. రంగంలోకి భారత్ సొంత గ్యాస్!
X

IDME fuel: LPG కష్టాలకు చెక్.. రంగంలోకి భారత్ సొంత గ్యాస్!

DME fuel: LPG కష్టాలకు చెక్.. రంగంలోకి భారత్ సొంత గ్యాస్!

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ఎల్‌పీజీ (LPG) ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో సామాన్యుడి వంటగది బడ్జెట్ తలకిందులవుతోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత్ ఇప్పుడు ఒక శక్తివంతమైన 'ప్లాన్ బి'ని సిద్ధం చేసింది. అదే DME (Dimethyl Ether). విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా, స్వదేశీ వనరులతోనే వంట గ్యాస్‌ను ఉత్పత్తి చేసే దిశగా దేశంలో అడుగులు పడుతున్నాయి.

ఏమిటీ ఈ DME?

DME అనేది మిథనాల్‌ను ఉపయోగించి కృత్రిమంగా తయారు చేసే ఒక స్వచ్ఛమైన ఇంధనం. దీని తయారీకి అవసరమైన ముడి పదార్థాలు మన దేశంలో పుష్కలంగా దొరుకుతాయి. దీనికి కావాల్సిన ముడి పదార్థాలు బయోమాస్ (వ్యర్థాలు), బొగ్గు, గాలిలోని కార్బన్ డయాక్సైడ్ (CO2). రసాయన ధర్మాల పరంగా ఇది దాదాపు ఎల్‌పీజీ లాగే ఉంటుంది. ఇది మండేటప్పుడు తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది, కాబట్టి ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

సాధారణంగా ఏదైనా కొత్త ఇంధనం మార్కెట్లోకి వస్తుందంటే కొత్త స్టవ్ లేదా సిలిండర్ కొనాలని భయపడతారు. కానీ DME విషయంలో ఆ చింత అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుత ఎల్‌పీజీ మౌలిక సదుపాయాలలో ఎలాంటి మార్పులు చేయకుండానే DMEని వాడవచ్చని చెబుతున్నారు. మీ ఇంట్లో ప్రస్తుతం ఉన్న సిలిండర్లు, రెగ్యులేటర్లు, పైపులు, స్టవ్‌లు ఈ గ్యాస్‌కు పక్కగా సరిపోతాయని వెల్లడించారు. గృహ, వాణిజ్య అవసరాల కోసం ఎల్‌పీజీలో DMEని కలిపి (Blending) వాడటానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఇప్పటికే అనుమతులు, ప్రమాణాలను ఖరారు చేసింది.

ఇంధన రంగంలో 'ఆత్మనిర్భర్ భారత్'

ప్రస్తుతం మన దేశం వంట గ్యాస్ కోసం అధికంగా ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడల్లా ఇక్కడ సామాన్యుడిపై భారం పడుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని CSIR-నేషనల్ కెమికల్ లాబొరేటరీ (NCL) శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. ఇప్పుడు దీనిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి ప్రతి ఇంటికీ చేరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ స్వదేశీ ప్రణాళిక పట్టాలెక్కితే, అంతర్జాతీయ యుద్ధాలతో సంబంధం లేకుండా భారత్‌లో వంట గ్యాస్ ధరలు స్థిరంగా ఉంటాయి. ఇది కేవలం ఇంధన భద్రత మాత్రమే కాదు, సామాన్యుడి ఆర్థిక భారాన్ని తగ్గించే ఒక గొప్ప విప్లవం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Ganesh

Ganesh

Next Story