National Space Day : స్పేస్‌లో భారత్ దూకుడు కానీ.. మోదీ కీలక వ్యాఖ్యలు..
National Space Day : భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో మరో చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’ (National Space Day)..
National-Space-Day
National Space Day : భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో మరో చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’ (National Space Day) వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలకు, రాత్రింబవళ్లు శ్రమించే ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ స్పేస్ సెక్షర్‌లో భారత్ వేగంగా దూసుకుపోతోందని, ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించే ఒక శక్తివంతమైన 'ఆయస్కాంతం'లా మన దేశం రూపాంతరం చెందిందని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు.
అయోధ్య స్ఫూర్తితో కొత్త శకానికి నాంది
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, దేశ అంతరిక్ష భవిష్యత్తుపై తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. "అయోధ్య వేదికగా నేను వ్యాఖ్యానించినట్లే, ఇది దేశంలో ఒక నవశకానికి ఆరంభం. ప్రపంచ వేదికపై భారత్ తన అంతరిక్ష సామర్థ్యాన్ని , ఉనికిని అత్యంత స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో విస్తరిస్తోంది. 2047 నాటికి 'వికసిత భారత్' కల నెరవేరడంలో మన అంతరిక్ష పరిశోధన రంగం అత్యంత కీలకమైన డ్రైవింగ్ ఫోర్స్‌గా నిలవబోతోంది" అని ప్రధాని స్పష్టం చేశారు.
'జెన్-జీ' ఇన్నోవేషన్స్ అద్భుతం.. యువతకు సలాం
దేశీయంగా పెరుగుతున్న సాంకేతిక విప్లవంలో నేటి తరం యువత వహిస్తున్న పాత్రను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కొనియాడారు. "మన 'జెన్-జీ' (Gen-Z) ఇంజనీర్లు, డెవలపర్లు, కోడర్లు , యువ శాస్త్రవేత్తలు కేవలం సంప్రదాయ విధానాలకే పరిమితం కాకుండా, అత్యాధునిక సాంకేతికతలను ఆవిష్కరిస్తున్నారు. ప్రొపల్షన్ సిస్టమ్‌ల రూపకల్పన నుంచి శాటిలైట్ ప్లాట్‌ఫారమ్‌ల తయారీ వరకు.. గతంలో ఎన్నడూ ఊహించని సవాలుతో కూడిన రంగాల్లో మన కుర్రాళ్లు సత్తా చాటుతున్నారు" అని ప్రశంసించారు. ఇస్రో సాధిస్తున్న వరుస విజయాలు దేశంలోని కోట్లాది మంది పాఠశాల పిల్లల్లో శాస్త్రవేత్తలు కావాలనే బలమైన కోరికను, స్ఫూర్తిని రగిలిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
చంద్రయాన్-3 చారిత్రక విజయం.. జాతీయ అంతరిక్ష దినోత్సవ నేపథ్యం
2023 ఆగస్టు 23న భారతదేశానికి చెందిన 'చంద్రయాన్-3' విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అద్భుత విజయానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 23ను 'జాతీయ అంతరిక్ష దినోత్సవం'గా ప్రకటించింది. ఈ సంవత్సరం "వికసిత భారత్ దిశగా: ఆవిష్కరణ, సహకారం, ప్రపంచ అంతరిక్ష నాయకత్వం" అనే ప్రత్యేక థీమ్‌తో వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ మాట్లాడుతూ.. భారతదేశ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను (Space Ecosystem) మరింత బలోపేతం చేయడానికి నిరంతర ఆవిష్కరణలు, ప్రైవేట్ భాగస్వామ్యాలు , అంతర్జాతీయ సహకారం ఎంతగానో అవసరమని పిలుపునిచ్చారు. ప్రైవేట్ స్టార్టప్‌లు కూడా ఈ రంగంలోకి అడుగుపెడుతుండటంతో భారత అంతరిక్ష రంగం సరికొత్త శిఖరాలను తాకుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.




