Priyanka Gandhi: జెర్సీ మార్చినా దేశ ఆత్మను మార్చలేరు.. హాకీ కొత్త జెర్సీపై ప్రియాంక గాంధీ ఫైర్!
Priyanka Gandhi: భారత హాకీ జట్టు కాషాయ రంగు జెర్సీపై రాజకీయ దుమారం రేగుతోంది.
Priyanka Gandhi: జెర్సీ మార్చినా దేశ ఆత్మను మార్చలేరు.. హాకీ కొత్త జెర్సీపై ప్రియాంక గాంధీ ఫైర్!
Priyanka Gandhi: భారత హాకీ జట్టు సంప్రదాయ నీలం జెర్సీ స్థానంలో ప్రపంచకప్ కోసం కాషాయ రంగు జెర్సీని ప్రవేశపెట్టడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ మార్పుపై క్రీడా వర్గాలతో పాటు రాజకీయంగానూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత హాకీ మాజీ కెప్టెన్ విరేన్ రస్క్వీనా ఈ నిర్ణయాన్ని తప్పుపట్టగా, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వం మరియు నిర్ణయాధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన ప్రియాంక గాంధీ, జెర్సీ మార్చినా లేదా పాఠ్యాంశాల్లో చరిత్రను తిరగరాయాలని చూసినా ప్రజల భావజాలాన్ని మార్చడం సాధ్యం కాదని పేర్కొన్నారు. "కేవలం జెర్సీ మార్పు మాత్రమే కాదు, చరిత్రను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ దేశ యువత తమ అభిప్రాయాన్ని ముందే స్పష్టం చేసింది. ద్వేషం రెచ్చగొట్టినా, ఐక్యతను దెబ్బతీయాలని చూసినా భారత మూల విలువలైన సత్యం, అహింసలను ఎవరూ చెరిపేయలేరు. స్వాతంత్ర్య పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి పాత్ర లేదన్నది దేశ ప్రజలందరికీ తెలుసు" అని ప్రియాంక వ్యాఖ్యానించారు.
ప్రపంచకప్ కోసం ప్రకటించిన కాషాయ జెర్సీపై మాజీ కెప్టెన్ విరేన్ రస్క్వీనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత హాకీ అనగానే అభిమానులకు ముందుగా గుర్తుకొచ్చేది సంప్రదాయ నీలం జెర్సీయేనని అన్నారు. తాను ఏళ్లకు ఏళ్లు అదే జెర్సీతో దేశానికి ప్రాతినిధ్యం వహించానని, అభిమానుల మనసుల్లో నీలం రంగుకే ప్రత్యేక స్థానం ఉన్నప్పుడు ఉన్నట్టుండి కాషాయ రంగును ఎందుకు ఎంచుకున్నారో అర్థం కావడం లేదని ఆయన ప్రశ్నించారు.
విమర్శలు వెల్లువెత్తడంతో హాకీ ఇండియా కొత్త జెర్సీ రూపకల్పనపై స్పష్టత ఇచ్చింది. కాషాయ రంగు ధైర్యం, త్యాగం మరియు విజయానికి ప్రతీక అని తెలిపింది. జాతీయ పతాకం, ఉదయించే సూర్యుడి స్ఫూర్తితోనే ఈ రంగును ఎంచుకున్నామని పేర్కొంది. అశోక చక్రాన్ని ప్రతిబింబించే నేవీ బ్లూ అంచులు, మండల కళారూపాలు, సుదర్శన చక్రం డిజైన్‌తో ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ భావనకు అనుగుణంగానే ఈ జెర్సీని రూపొందించినట్లు స్పష్టం చేసింది.




