విహారానికి వెళ్లిన ఇద్దరు.. తిరిగొచ్చింది ఒక్కరే.. ఇండిగో ఉద్యోగిని మృతి వెనుక మిస్టరీ!
IndiGo Employee: స్నేహితుడితో కలిసి సరదాగా విహారానికి వెళ్లిన ఓ ఇండిగో సంస్థ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో శవమై తేలింది.
విహారానికి వెళ్లిన ఇద్దరు.. తిరిగొచ్చింది ఒక్కరే.. ఇండిగో ఉద్యోగిని మృతి వెనుక మిస్టరీ!
IndiGo Employee: స్నేహితుడితో కలిసి సరదాగా విహారానికి వెళ్లిన ఓ ఇండిగో సంస్థ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో శవమై తేలింది. మహారాష్ట్ర - మధ్యప్రదేశ్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలితో పాటు వెళ్లిన స్నేహితుడి వాంగ్మూలంలో వివరాలు పొంతన లేకుండా ఉండటంతో, పోలీసులు దీనిని అనుమానాస్పద హత్యగా పరిగణిస్తూ అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన 35 ఏళ్ల వర్ష తుర్కర్, పుణె విమానాశ్రయంలోని ఇండిగో టికెట్ కౌంటర్‌లో ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఆమెకు 2024లో వివాహం కాగా, భర్త ఇండోర్‌లో నివాసం ఉంటున్నారు. దీపావళి పండుగ వేడుకల కోసం వర్ష తన రెండేళ్ల కుమార్తెతో కలిసి మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ఉన్న తన పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో తన స్నేహితుడు నితేశ్ అగర్వాల్‌తో కలిసి మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతానికి విహారానికి వెళ్లింది.
ఇద్దరూ కలిసి వైన్‌గంగ నది వద్దకు వెళ్లారు. అయితే కొంతసేపటి తర్వాత నితేశ్, వర్ష కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ సరిహద్దు సమీపంలోని గోండియా జిల్లా బోండ్రాని అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు తమపై దాడి చేశారని సమాచారం ఇచ్చాడు. ఆందోళనకు గురైన వర్ష తల్లిదండ్రులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ వర్ష తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉండటంతో హుటాహుటిన సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. వర్షతో పాటు వెళ్లిన స్నేహితుడు నితేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, ముసుగు ధరించిన దుండగులు తమపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారని అతడు చెప్పుకొచ్చాడు. అయితే, నితేశ్ చెబుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన కుదరడం లేదు.
దుండగులు ఇద్దరిపై దాడి చేస్తే, నితేశ్ శరీరంపై కనీసం ఒక్క చిన్న గాయం కూడా లేకపోవడం పోలీసులకు బలమైన అనుమానాన్ని కలిగిస్తోంది. మృతురాలు వర్షపై పదునైన ఆయుధంతో అత్యంత దారుణంగా దాడి జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. పోలీసుల విచారణలో నితేశ్ పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో అతడినే ప్రధాన అనుమానితుడిగా భావిస్తూ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
వర్ష తన పెద్ద కుమార్తె అని, ఈ దారుణం జరిగిన తర్వాతే తమకు విషయం తెలిసిందని మృతురాలి తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. ప్రస్తుతం పోలీసులు బంధువులను ప్రశ్నించడంతో పాటు, వర్ష మరణానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.




