IndiGo: ఇండిగో సర్వర్లకు ఏమైంది? వారం రోజుల్లో రెండోసారి డౌన్.!
దేశీయ విమానయాన రంగంలో అతిపెద్ద సంస్థ అయిన 'ఇండిగో' (IndiGo) డిజిటల్ సేవలు మళ్లీ నిలిచిపోయాయి. శుక్రవారం నాడు ఇండిగో అధికారిక వెబ్‌సైట్ , మొబైల్
indigo
దేశీయ విమానయాన రంగంలో అతిపెద్ద సంస్థ అయిన 'ఇండిగో' (IndiGo) డిజిటల్ సేవలు మళ్లీ నిలిచిపోయాయి. శుక్రవారం నాడు ఇండిగో అధికారిక వెబ్‌సైట్ , మొబైల్ యాప్‌లలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టికెట్ బుకింగ్స్, వెబ్ చెక్-ఇన్, పేమెంట్ కన్ఫర్మేషన్లు కాకపోవడంతో విమానాశ్రయాల్లోనూ, ఆన్‌లైన్ సేవలు వినియోగించే క్రమంలో ప్రయాణికులు తీవ్ర అయోమయానికి గురయ్యారు.
అసలు ఏం జరిగింది? "నో డేటా అవైలబుల్"
ఇండిగో మెయిన్ రిజర్వేషన్ సిస్టమ్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవడానికి లేదా వివరాలు తనిఖీ చేయడానికి ప్రయత్నించినప్పుడు వెబ్‌సైట్‌లో "నో డేటా అవైలబుల్" (No Data Available) అని దర్శనమిచ్చింది. అలాగే లాగిన్ అవ్వడంలోనూ, డిజిటల్ చెల్లింపులు పూర్తయిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్‌లు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధితులు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియా వేదికగా (X/ట్విట్టర్) ఇండిగో యాజమాన్యానికి ఫిర్యాదులు చేశారు.
ఇండిగో అధికారిక స్పందన
సాంకేతిక అంతరాయంపై ఇండిగో సంస్థ వెంటనే ఒక సర్వీస్ అడ్వైజరీని విడుదల చేసింది. తమ కోర్ రిజర్వేషన్ ప్లాట్‌ఫామ్‌లో సాంకేతిక లోపాలు ఎదురవుతున్నాయని, దానివల్ల వినియోగదారులకు ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉండకపోవచ్చని అంగీకరించింది. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు తమ సాంకేతిక బృందాలు , టెక్నాలజీ పార్ట్‌నర్లతో కలిసి అత్యంత ప్రాధాన్యతతో పనిచేస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే సమస్య ఎప్పుడు పూర్తిగా పరిష్కారమవుతుందనే దానిపై ఇండిగో స్పష్టమైన గడువును ప్రకటించలేదు.
ఒకే వారంలో రెండోసారి.. పెరిగిన ప్రయాణికుల ఆందోళన
ఇండిగో సర్వర్లలో ఈ రకమైన సమస్య తలెత్తడం ఈ వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం. బుధవారం కూడా ఇదే తరహా సాంకేతిక లోపంతో ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయని ఇండిగో ప్రకటించింది. రెండు రోజు వ్యవధిలోనే మళ్లీ అదే సమస్య పునరావృతం కావడంతో రోజూ ఇండిగో ద్వారా ప్రయాణించే ప్రయాణికులలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
మార్కెట్‌లో 67 శాతం వాటా.. ప్రభావం భారీగా
భారతదేశ దేశీయ విమానయాన రంగంలో ఇండిగో అతిపెద్ద మార్కెట్ వాటాను కలిగి ఉంది. దేశీయ ఏవియేషన్ మార్కెట్‌లో దాదాపు 67 శాతం వాటా ఒక్క ఇండిగోదే కావడం గమనార్హం. దేశంలో అత్యధిక విమాన సర్వీసులు నడిపే సంస్థ కావడం వల్ల, దాని రిజర్వేషన్ , బుకింగ్ వ్యవస్థలు స్తంభించిపోవడం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులపై దీని ప్రభావం పడింది.




