బామ్మతో జ్ఞాపకాలు.. ఇందిరమ్మను గుర్తు చేసుకున్న రాహుల్, ప్రియాంక

మాజీ ప్రధాని, 'భారత ఉక్కు మహిళ' ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె మనుమడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర

G Krishna
Published on: 31 Oct 2026 12:14 PM IST
Indira Gandhi Death Anniversary
X

Indira Gandhi Death Anniversary

మాజీ ప్రధాని, 'భారత ఉక్కు మహిళ' ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె మనుమడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చిన్నతనంలో తమ బామ్మతో కలసి గడిపిన తీపి జ్ఞాపకాలను, అరుదైన చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఇందిరమ్మకు ఘన నివాళులర్పించారు.

బామ్మ నేర్పిన శాంతి మంత్రం , ప్రియాంక స్మరణ

రాహుల్ గాంధీ తన చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ, చిన్నతనంలో బామ్మ ఒడిలో కూర్చొని ఆమె రెండు చేతులనూ గట్టిగా పట్టుకుని, ఆమె చెప్పిన మంత్రాలను వింటూ వెనుకే వల్లించేవాడినని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. యజుర్వేదంలోని ప్రసిద్ధ శాంతి మంత్రమైన "అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ" పంక్తులను ప్రస్తావిస్తూ, బామ్మ తనకు అందించిన ఈ జ్ఞాన సంపద ఊహించని అమూల్యమైన కానుక అని కొనియాడారు. అదే సమయంలో ప్రియాంక గాంధీ కూడా ఇందిరమ్మతో ఉన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ, ఆమె ఆకాశమంత స్వేచ్ఛ, సముద్రమంత లోతు, నేలమంత సహనం , నిప్పు కంటే ఎక్కువ ప్రకాశం ఉన్న అద్భుతమైన మహిళ అని శ్లాఘించారు.

అమరత్వానికి ప్రతీకగా ఇందిరమ్మ త్యాగం

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఇందిరా గాంధీ తన మరణానికి ఒక్క రోజు ముందు చేసిన చివరి ప్రసంగంలోని పదాలను ఉటంకిస్తూ, తనలో ఊపిరి ఉన్నంతవరకు దేశ సేవ ఆగదని, తన శరీరంలోని ప్రతి రక్తపు బొట్టు ఈ దేశ సమగ్రతను కాపాడుతూనే ఉంటుందని ఇందిరమ్మ అన్న మాటలను గుర్తుచేశారు. అచంచలమైన ధైర్యానికి, దార్శనిక నాయకత్వానికి ఇందిరా గాంధీ ప్రతీక అని, ఆధునిక భారత నిర్మాణంలో ఆమె చూపిన చొరవ నిరంతరం స్ఫూర్తినిస్తుందని ఖర్గే నివాళులర్పించారు.

దేశ ప్రగతికి వేసిన బలమైన బాటలు

1917 నవంబర్ 19న జన్మించిన ఇందిరా గాంధీ ప్రధానిగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో చారిత్రాత్మక పాత్ర పోషించారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో ఆమె చూపిన సాహసోపేతమైన నాయకత్వం బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీయడమే కాకుండా, ప్రపంచ వేదికపై భారత్‌ను బలమైన దేశంగా నిలిపింది. దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించేందుకు హరిత విప్లవాన్ని ప్రోత్సహించడంతో పాటు, 1974లో పోఖ్రాన్ అణు పరీక్షలు , అంతరిక్ష రంగానికి ఊపునిచ్చి దేశ సాంకేతిక సామర్థ్యాన్ని చాటారు. అంతేకాకుండా పేదలకు, వ్యవసాయ రంగానికి ఆర్థిక ఫలాలు అందాలనే లక్ష్యంతో 14 ప్రధాన వాణిజ్య బ్యాంకులను జాతీయకరణ చేసి దేశ రక్షణ, ఆర్థిక వ్యవస్థల పురోగతికి ఇందిరమ్మ నిరంతరం శ్రమించారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.