Tanishq Robbery Case: ప్రియురాలి కోసం రూ. 30 కోట్ల బంగారం దోపిడీ చేసిన ప్రముఖ యూట్యూబర్..!
Tanishq Robbery Case: తమిళనాడులోని మదురై తనిష్క్ జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన రూ. 30 కోట్ల దోపిడీ కేసులో సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
Tanishq Robbery Case: ప్రియురాలి కోసం రూ. 30 కోట్ల బంగారం దోపిడీ చేసిన ప్రముఖ యూట్యూబర్..!
YouTuber Nishanth: తమిళనాడులోని మదురైలో ఇటీవల సంచలనం సృష్టించిన రూ. 30 కోట్ల తనిష్క్ జ్యువెలరీ షోరూమ్ దోపిడీ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్న ఇద్దరు యూట్యూబర్లు ఈ భారీ చోరీ వెనుక ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తన స్నేహితురాలిని ఆదుకోవడం కోసం ఒక యూట్యూబర్ ఏకంగా షోరూమ్‌నే కొల్లగొట్టడం ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మదురై బైపాస్ రోడ్డులోని పలంగనాథం వద్ద కొత్తగా ప్రారంభమైన తనిష్క్ జ్యువెలరీ షోరూమ్‌లో నవంబర్ 12 తెల్లవారుజామున ఈ భారీ దోపిడీ జరిగింది. సుమారు 10 కిలోల బంగారం, ఒక కిలో వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి.
దోపిడీకి ముందు ప్రధాన నిందితుడు, యూట్యూబర్ అయిన నిషాంత్ మూడుసార్లు కస్టమర్ వేషంలో షోరూమ్‌కు వచ్చి పక్కాగా రెక్కీ నిర్వహించినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు.
షోరూమ్ కొత్తది కావడంతో ఇంకా పూర్తిస్థాయి లాకర్ సదుపాయం లేకపోవడం, రాత్రివేళ యాంటీ-బర్గ్లరీ అలారం ఆన్ చేయకపోవడాన్ని నిషాంత్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. భవనం వెనుక ఉన్న స్కాఫోల్డింగ్ సాయంతో టెర్రస్ మీదుగా లిఫ్ట్ షాఫ్ట్ ద్వారా లోపలికి చొరబడి, అందినకాడికి బంగారు, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లాడు.
ఆర్థిక కష్టాల్లో ఉన్న తన స్నేహితురాలు, ప్రముఖ యూట్యూబర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మీనాక్షి కోసమే నిషాంత్ ఈ సాహసానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ చేసిన నగలలోని సుమారు 5 నుండి 6 కిలోల బంగారు, వజ్రాభరణాలను మదకుళం చెరువు సమీపంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో గోనె సంచుల్లో పెట్టి భూమిలో పాతిపెట్టారు.
మిగిలిన నగలతో నిషాంత్ పరారయ్యాడు. మరోవైపు, దోపిడీ సమయంలో నిషాంత్ ధరించిన దుస్తులను తగలబెట్టి సాక్ష్యాలను మాయం చేయడంలో అతని తండ్రి సురేశ్ కీలక పాత్ర పోషించాడు.
ఈ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఆటోరిక్షా ప్రయాణ వివరాలు, సెల్ ఫోన్ సిగ్నల్స్, స్థానికంగా ఉన్న ఒక పశువుల కాపరి ఇచ్చిన కీలక సమాచారంతో నిందితుల గుట్టు రట్టు చేశారు. మదకుళం పొలంలో పాతిపెట్టిన 6 కిలోల బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇన్‌ఫ్లుయెన్సర్ మీనాక్షితో పాటు నిషాంత్ తండ్రి సురేశ్‌ను అరెస్ట్ చేశారు. వీరిద్దరినీ కోర్టులో హాజరుపరచగా, నవంబర్ 29 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నిషాంత్ చివరి లొకేషన్ తిరుప్పూర్‌లో ట్రేస్ అయినట్లు మదురై పోలీస్ కమిషనర్ ఎస్. రాజేంద్రన్ వెల్లడించారు. అతడిని పట్టుకునేందుకు 9 ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయని, నిషాంత్ దొరికితే మిగిలిన 4 కిలోల బంగారం కూడా రికవరీ అవుతుందని ఆయన స్పష్టం చేశారు.




