Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఖమేనీ ఫోటో..పోస్టర్లు

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు ఖమేనీ చిత్రపటాన్ని ప్రదర్శించారు.

KVD Varma
Published on: 27 March 2026 2:45 PM IST
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు ఖమేనీ
X

Jammu Kashmir

Jammu Kashmir: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ మృతికి నిరసనగా శుక్రవారం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పెద్ద గందరగోళం రేగింది. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు ఖమేనీ చిత్రపటాన్ని చేతబట్టుకుని, మద్దతుగా నినాదాలు చేస్తూ సభలోకి ప్రవేశించారు. వారు ఖమేనీ పోస్టర్లను కూడా ప్రదర్శించారు. దీంతో సభలో రభస జరిగింది. ఈ సమయంలో బీజేపీ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది.

కాంగ్రెస్-బీజేపీ మధ్య ఘర్షణ..

జమ్మూ కాశ్మీర్ శాసనసభలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో ఒకటి బయటపడింది. అయితే, రాహుల్ గాంధీ గురించి బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ హఫీజ్, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా, దానికి ప్రతిస్పందనగా బీజేపీ ఎమ్మెల్యే యుధ్వీర్ సేథి, రాహుల్ గాంధీని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇద్దరు నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

మేము ఇరాన్ కు అండగా ఉంటాము..

ఇదిలా ఉండగా, ఇరాన్ యుద్ధంపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, "ఇరాన్‌పై ఈ యుద్ధాన్ని రుద్దిన తీరుకు ఎవరూ మద్దతుగా నిలవరు. మానవాళిని హత్య చేసిన తీరును, ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతొల్లా ఖమేనీతో పాటు ఆయన సహచరులు, సన్నిహిత బంధువులను హతమార్చిన ఘట్టాన్ని ఎంత ఖండించినా సరిపోదు" అని అన్నారు. ఈ సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే తన్వీర్ సాదిక్ మాట్లాడుతూ, "మేము ఇరాన్‌కు అండగా నిలుస్తాము. మా పార్టీ, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తాయి. గతసారి ఒక పౌర సమాజ సమావేశంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అయతొల్లా అలీ ఖమేనీ హత్యను ఖండించినట్లే, ఈరోజు మేమందరం కూడా ఇక్కడ అదే విధంగా నిలబడతాము." అంటూ చెప్పారు.

ఖమేనీని హతమార్చిన రీతిలో మరో దేశంపై దాడి చేసే హక్కు ఏ దేశానికీ లేదని మేము విశ్వసిస్తున్నాము. దేశ అత్యున్నత నాయకత్వం దీనిని ఖండించాలని నేను నమ్ముతున్నాను. మేము ఇరాన్ ప్రజలకు మద్దతు ఇస్తున్నాము. అంటూ ఆయన శాసనసభలో ప్రకటించారు.

కాశ్మీర్‌లో ఇరాన్‌కు ₹18 కోట్ల విరాళాలు

కాశ్మీర్ లోయలో ఇరాన్‌కు మద్దతుగా కోట్లాది రూపాయల విరాళాలు సమకూరాయి. దీంతో దేశ భద్రతా సంస్థలు అప్రమత్తం అయ్యాయి. ఈ డబ్బును ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికి ఉపయోగించవచ్చనే భయాలు భద్రతా దళాల్లో వ్యక్తమవుతున్నాయి. అక్కడి మీడియా సమాచారం ప్రకారం, ఇప్పటివరకు సుమారు ₹18 కోట్లు సమకూరాయి. ఈ మొత్తంలో 85% షియా సమాజం విరాళంగా ఇచ్చింది. కాశ్మీర్‌లోని షియా ప్రాబల్య ప్రాంతమైన బుద్గామ్ సుమారు ₹9.5 కోట్లు సేకరించింది.

మొత్తంగా చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ లో ఇరాన్ కు ప్రజాప్రతినిధులు బహిరంగంగానే మద్దతు పలుకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story