రైలు టికెట్ బుక్ చేసుకునే సమయంలో భోజనం వద్దంటున్న ప్రయాణికులు.. అసలు కారణం ఇదే
IRCTC: రైలులో ప్రయాణించే సమయంలో భోజనం కోసం ముందుగానే చెల్లించే అవకాశం ఉన్నా.. కొంతమంది ప్రయాణికులు ఇప్పుడు ఆ ఆప్షన్‌ను తీసుకోవడం లేదు.
రైలు టికెట్ బుక్ చేసుకునే సమయంలో భోజనం వద్దంటున్న ప్రయాణికులు.. అసలు కారణం ఇదే
IRCTC: రైలులో ప్రయాణించే సమయంలో భోజనం కోసం ముందుగానే చెల్లించే అవకాశం ఉన్నా.. కొంతమంది ప్రయాణికులు ఇప్పుడు ఆ ఆప్షన్‌ను తీసుకోవడం లేదు. ఇంతకీ ప్రయాణికులు ఇలా చేయడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
30 శాతం మంది భోజనం ఆప్షన్‌ను వద్దంటున్నారా?
రైలు టికెట్ బుక్ చేసుకునే సమయంలో భోజనం కూడా ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం కొంతమంది ప్రయాణికులు ఈ సదుపాయాన్ని తీసుకోవడం లేదని IRCTC తెలిపింది. IRCTC చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ హిమాలియన్ ప్రకారం.. ప్రీపెయిడ్ క్యాటరింగ్ ఆప్షన్ తీసుకున్న ప్రయాణికుల్లో సుమారు 25 నుంచి 30 శాతం మంది భోజనాన్ని వద్దనుకుంటున్నట్లు ప్రాథమిక అంచనా ఉంది.
అయితే ఇది తుది గణాంకం కాదని, ఇంకా నిర్ధారించాల్సి ఉందని ఆయన తెలిపారు. ప్రయాణికులు క్యాటరింగ్ ఛార్జీలను ఆదా చేసుకోవడానికి భోజనాన్ని ముందుగానే బుక్ చేసుకోవడం లేదని IRCTC యాజమాన్యం పేర్కొంది.
క్యాటరింగ్ ఆదాయం మాత్రం భారీగా పెరిగింది
ప్రయాణికుల్లో కొందరు ప్రీపెయిడ్ భోజనాన్ని వద్దనుకుంటున్నప్పటికీ IRCTC క్యాటరింగ్ వ్యాపారంపై మాత్రం పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. సంస్థకు క్యాటరింగ్ ఇప్పటికీ ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటిగా ఉంది.
2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో క్యాటరింగ్ ద్వారా IRCTC రూ.732.26 కోట్ల ఆదాయం పొందింది. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.546.78 కోట్లతో పోలిస్తే ఇది 33.9 శాతం వృద్ధి. ఇదే సమయంలో సంస్థ మొత్తం కార్యకలాపాల ఆదాయం 18.1 శాతం పెరిగి రూ.1,369.53 కోట్లకు చేరింది. అంటే కొంతమంది ప్రయాణికులు ప్రీపెయిడ్ మీల్స్‌ను వద్దనుకుంటున్నప్పటికీ.. రైళ్లలో మొత్తం క్యాటరింగ్ సేవలకు డిమాండ్ కొనసాగుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
ఆహారంపై రోజుకు 300-500 ఫిర్యాదులు
రైల్వే భోజనం నాణ్యతపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయా అనే ప్రశ్నకు కూడా IRCTC యాజమాన్యం స్పందించింది. రోజుకు సుమారు 18 లక్షల భోజనాలను సరఫరా చేస్తున్నామని, వాటికి సంబంధించి రోజుకు దాదాపు 300-500 క్యాటరింగ్ ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపింది. అయితే ఈ ఫిర్యాదులన్నీ ఆహారం నాణ్యతకు సంబంధించినవి కావని IRCTC స్పష్టం చేసింది.
నీళ్లు కావాలని అడగడం, చిన్నపిల్లలకు బేబీ ఫుడ్ కోరడం, సిబ్బంది ప్రవర్తనపై ఫిర్యాదులు చేయడం వంటి అంశాలు కూడా ఇందులో ఉంటాయి. ఇక గత మూడు సంవత్సరాల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలపై IRCTC రూ.5.13 కోట్ల జరిమానా విధించింది. 54 షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు ఆరు కాంట్రాక్టులను రద్దు చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
క్యాటరింగ్ సేవలను విస్తరిస్తున్న IRCTC
ప్రయాణికులకు మరిన్ని ఆహార ఎంపికలు అందించేందుకు IRCTC తన డిజిటల్ క్యాటరింగ్ సేవలను కూడా విస్తరిస్తోంది. ఈక్యాటరింగ్ ద్వారా రోజువారీ ఆర్డర్లు సుమారు 1.25 లక్షల నుంచి 1.6 లక్షలకు పైగా పెరిగినట్లు సంస్థ తెలిపింది. అదే సమయంలో ఈ పాంట్రీ సేవలు 50కి పైగా రైళ్లలో అందుబాటులో ఉన్నాయని, భవిష్యత్తులో వీటిని సుమారు 100 రైళ్లకు విస్తరించే ప్రణాళిక ఉందని వెల్లడించింది.
డిజిటల్ ప్లాట్‌ఫామ్ లేదా QR కోడ్ ద్వారా ప్రయాణికులు తమ రైలులో అందుబాటులో ఉన్న విక్రేతల నుంచి భోజనం ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా క్యాటరింగ్ రంగంలో పోటీ పెంచేందుకు ప్రముఖ బ్రాండ్లను కూడా ఈ వ్యవస్థలోకి తీసుకురావడంపై IRCTC, రైల్వే శాఖ చర్చిస్తున్నాయి. దీనివల్ల ప్రయాణికులకు మరిన్ని ఆహార ఎంపికలు లభించడంతో పాటు సేవల నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంది.




