IT Raids: నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇళ్లలో ఐటీ సోదాలు.. పనోరమా స్టూడియోస్ కార్యాలయాల్లో తనిఖీలు!

IT Raids: సినీనటి రకుల్ ప్రీత్ సింగ్, ఆమె అత్తంటివారికి చెందిన 'పనోరమా స్టూడియోస్' కార్యాలయాల్లో ముంబై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Arun Chilukuri
Published on: 28 Sept 2026 5:04 PM IST
IT Raids
X

IT Raids: నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇళ్లలో ఐటీ సోదాలు.. పనోరమా స్టూడియోస్ కార్యాలయాల్లో తనిఖీలు!

IT Raids: ప్రముఖ సినీనటి రకుల్‌ ప్రీత్‌ సింగ్ మరియు ఆమె అత్తంటివారికి సంబంధించిన కార్యాలయాల్లో ముంబై ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘పనోరమా స్టూడియోస్’కు సంబంధించిన దాదాపు 15 ప్రదేశాల్లో ఈ తనిఖీలు (IT Searches) కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలోనే అధికారులు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

సినిమా షూటింగ్‌లు, నిర్మాణ పనుల పేరుతో భారీ మొత్తంలో నగదును అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖకు పక్కా సమాచారం అందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమాచారం ఆధారంగానే ముంబైలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టినట్లు తెలిపారు. సోదాలు పూర్తిగా ముగిసిన అనంతరం ఆర్థిక అవకతవకలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని పేర్కొన్నారు.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత వాషు భగ్నానీ కుమారుడు, నిర్మాత జాకీ భగ్నానీని 2024లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వాషు భగ్నానీకి చెందిన ‘పనోరమా స్టూడియోస్’ బ్యానర్‌పై ‘దృశ్యం’, ‘రెహనా హై తేరే దిల్ మే’, ‘మిషన్ రాణిగంజ్’ వంటి పలు విజయవంతమైన చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థకు సంబంధించిన కార్యాలయాల్లోనే ఐటీ అధికారులు తనిఖీలు చేస్తుండటం బాలీవుడ్‌లో కలకలం రేపింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.