Tragedy : నర్మదా నదిలో ఘోర ప్రమాదం.. డ్యామ్‌లో మునిగిన టూరిజం క్రూయిజ్.. 6కు చేరిన మృతుల సంఖ్య
Tragedy : మధ్యప్రదేశ్ బర్గి డ్యామ్‌లో క్రూయిజ్ ప్రమాదం చోటు చేసుకుంది.ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందగా, 9 మంది గల్లంతయ్యారు. ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.
Jabalpur Tragedy
Tragedy : మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ వద్ద ఉన్న బర్గి డ్యామ్ (నర్మదా నది)లో చోటు చేసుకున్న క్రూయిజ్ ప్రమాదం పెను విషాదంగా మారింది. గురువారం సాయంత్రం వీచిన బలమైన గాలివాన ధాటికి పర్యాటకులతో ఉన్న క్రూయిజ్ బోటు అదుపు తప్పి నీటిలో మునిగిపోయింది. శుక్రవారం ఉదయానికి ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 6కు చేరగా, మరో 9 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయి.
ప్రమాద తీవ్రత దృష్ట్యా ఆగ్రా నుంచి ప్రత్యేక ఆర్మీ బృందాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్ సభ్యులను రప్పించారు. నీటిలో మునిగిపోయిన క్రూయిజ్ లోపల ఎవరైనా చిక్కుకున్నారా అని తెలుసుకోవడానికి గ్యాస్ కట్టర్ల సహాయంతో బోటు భాగాలను కోసి వెతుకుతున్నారు. భారీ హైడ్రాలిక్ క్రేన్లు, జేసీబీల సహాయంతో నీటి అడుగున ఉన్న క్రూయిజ్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం మరో ఇద్దరి మృతదేహాలు (ఒక మహిళ సహా) లభించడంతో మృతుల సంఖ్య పెరిగింది.
గల్లంతైన వారిలో చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉండటం అందరినీ కలచివేస్తోంది. 5 ఏళ్ల తమిళ్, 6 ఏళ్ల విరాజ్, 7 ఏళ్ల పూనమ్, 9 ఏళ్ల మయూరం అనే చిన్నారుల ఆచూకీ ఇంకా తెలియలేదు. వీరితో పాటు రేష్మా సయ్యద్, జ్యోతి శ్రీవాస్ వంటి వారు కూడా కనిపించకుండా పోయారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వయంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే పనులు చేసుకుంటున్న బీహార్‌కు చెందిన కరణ్ సింగ్, అరవింద్ యాదవ్ అనే కూలీలు అసాధారణ సాహసాన్ని ప్రదర్శించారు. క్రూయిజ్ మునిగిపోవడం చూసి ప్రాణాలకు తెగించి లైఫ్ జాకెట్లు, ట్యూబులతో నీటిలోకి దూకారు. దాదాపు 14 మందిని వీరు క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. "రాకాసి అలలు పర్వతాలంత ఎత్తున లేస్తున్నా, రబ్బర్ ట్యూబులతో వెళ్లి వారిని కాపాడాం" అని వారు కన్నీళ్లతో గుర్తు చేసుకున్నారు.
ఈ ప్రమాదంలో ప్రభావితమైన వారిలో జబల్‌పూర్ ఆయుధ కర్మాగారానికి చెందిన కామరాజ్ ఆర్య కుటుంబం కూడా ఉంది. కర్ణాటకకు చెందిన వీరు 22 మంది బంధువులతో కలిసి విహారయాత్రకు వచ్చారు. వీరిలో కొందరు ప్రాణాలతో బయటపడగా, మరికొందరి ఆచూకీ ఇంకా లభించలేదు. 60 మంది సామర్థ్యం ఉన్న ఈ క్రూయిజ్‌లో ప్రమాద సమయంలో 29 మంది పర్యాటకులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం వర్షం కురుస్తున్నా రెస్క్యూ టీమ్స్ వెతుకులాటను ఆపలేదు.




