Food Poisoning : ఇంట్లో నూడుల్స్ తిన్న అక్కాచెల్లెళ్లు.. ఏడేళ్ల చిన్నారి మృతి

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో వండుకున్న నూడుల్స్ తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఏడేళ్ల బాలిక..

G Krishna
Published on: 21 Nov 2026 1:45 PM IST
Food Poisoning
X

Food Poisoning

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో వండుకున్న నూడుల్స్ తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఏడేళ్ల బాలిక మరణించగా, ఆమె అక్క ఆసుపత్రి పాలైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. జైపూర్‌లోని ఝోత్వారా (Jhotwara) పరిధిలోని మంగళం సిటీ ప్రాంతంలో గురువారం జరిగిన ఈ ఘటన ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ఆహారం ఫుడ్ పాయిజనింగ్ కావడమే ఈ దుర్ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

నిద్రలేపితే కదలని చిన్నారి.. ఆసుపత్రికి తరలించేలోపే విషాదం

గురువారం ఉదయం అక్కాచెల్లెళ్లైన దివ్యాంశి, ఏడేళ్ల పిహు కుమావత్ ఇంట్లోనే స్వయంగా నూడుల్స్ తయారు చేసుకుని తిన్నారు. ఆ తర్వాత ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన తల్లి ఇద్దరు పిల్లలను నిద్రలేపేందుకు ప్రయత్నించింది. పెద్దమ్మాయి దివ్యాంశి నిద్రలేచినప్పటికీ, ఏడేళ్ల పిహు ఎంతసేపటికీ కదలకపోవడంతో తల్లి ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఇద్దరు బాలికలను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, పిహు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. తీవ్ర అస్వస్థతతో విషమ స్థితిలో ఉన్న అక్క దివ్యాంశికి వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. చికిత్సకు స్పందించిన ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో శుక్రవారం ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

నూడుల్స్ నమూనాలను ల్యాబ్‌కు పంపిన పోలీసులు

ఈ ఘటనపై మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్ధాని పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లో మిగిలి ఉన్న నూడుల్స్ నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ప్రాథమిక విచారణలో ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్లు తెలుస్తున్నప్పటికీ, పోస్ట్‌మార్టం నివేదిక , ల్యాబ్ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణాలు స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు.

వరుస కష్టాల్లో ఆ కుటుంబం

మరోవైపు, ఈ కుటుంబం ఇప్పటికే తీవ్ర ఆర్థిక, మానసిక వేదనలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మృతురాలు పిహు సోదరుడు గోవింద్ గత రెండు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమారుడి అనారోగ్యంతో సతమతమవుతున్న తల్లిదండ్రులకు, ఇప్పుడు కళ్లముందే ఏడేళ్ల కూతురు దూరం కావడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.