Flash Floods : జమ్మూకశ్మీర్‌లో జలప్రళయం.. ముంచెత్తిన ఫ్లాష్ ఫ్లడ్స్.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్.!

Flash Floods : జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో శనివారం రాత్రి కురిసిన కుండపోత వర్షం పెను విపత్తును తెచ్చిపెట్టింది. రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన..

G Krishna
Published on: 19 July 2026 10:12 AM IST
flash-floods
X

flash-floods

Flash Floods : జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో శనివారం రాత్రి కురిసిన కుండపోత వర్షం పెను విపత్తును తెచ్చిపెట్టింది. రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ఆదివారం ఉదయాన్నే రాజౌరీ పట్టణంలో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. నదులు, వాగులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వందలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఉగ్రరూపం దాల్చిన నదులు.. కొట్టుకుపోయిన వాహనాలు

రాజౌరీ జిల్లాలోని ప్రధాన నదులైన దర్హాలీ, ఖాండ్లీ, సుక్తో, జమోలా నదులు ఉగ్రరూపం దాల్చాయి. వరద ఉధృతికి దర్హాలీ నదికి ఉన్న రక్షణ గోడ బద్దలైంది. దీంతో వరద నీరు ఒక్కసారిగా బేలా కాలనీ, కొత్త బస్ స్టాండ్ పరిసరాల్లోకి దూసుకొచ్చింది. బస్ స్టాండ్ లో నిలిపి ఉంచిన డజన్ల కొద్దీ వాహనాలు వరద నీరిలో మునిగిపోగా, మరికొన్ని వాహనాలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. అబ్దుల్లా బ్రిడ్జ్ సమీపంలోని మురికివాడలు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో దాదాపు 50కి పైగా కుటుంబాలు తమ నివాసాలను వదిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశాయి.

రంగంలోకి రెస్క్యూ టీమ్స్.. ఆపరేషన్ షురూ

వరద పోటెత్తిన తారిఖ్ బ్రిడ్జ్, ఇతర ప్రభావిత ప్రాంతాల నుండి వస్తున్న అత్యవసర పిలుపులకు పోలీసులు, రెస్క్యూ టీమ్స్ వెంటనే స్పందించాయి. నదీ తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చూడటమే తమ మొదటి ప్రాధాన్యతని, ఆస్తి నష్టం భారీగానే ఉన్నప్పటికీ వరద నీరు తగ్గిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీస్ అధికారులు వెల్లడించారు. ప్రమాదకర ప్రాంతాల్లో పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ చేస్తూ మైకుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసర సహాయం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేశారు.

నిరసనలు ఆపేసి నియోజకవర్గానికి పరుగెత్తిన ఎమ్మెల్యే

రాజౌరీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇఫ్తికర్ అహ్మద్ ఈ వరదలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూలోని లోక్ భవన్ వెలుపల జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ తన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే వరద తీవ్రతను తెలుసుకున్న ఆయన ఆ కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపేసి వెంటనే రాజౌరీకి చేరుకున్నారు. ఇలాంటి కష్టసమయంలో నా నియోజకవర్గ ప్రజలకు తోడుగా నిలబడటం నా బాధ్యత అని, అందుకే నా పార్టీ కార్యక్రమాన్ని వదిలి ఇక్కడికి వచ్చానని ఆయన పేర్కొన్నారు. వరద బాధితులకు తక్షణమే సహాయక, పునరావాస చర్యలు అందించాలని ఆయన జిల్లా యంత్రాంగాన్ని కోరారు.

జులై 23 వరకు భారీ వర్షాల హెచ్చరిక

వాతావరణ శాఖ జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా జులై 23 వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాజౌరీ జిల్లా యంత్రాంగం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని , నదీ తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని అడ్వైజరీ జారీ చేసింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story