Terror Network : కాశ్మీర్‌లో టెర్రర్ నెట్‌వర్క్‌కు భారీ షాక్.. 26 చోట్ల ఒకేసారి మెరుపు దాడులు.!

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద మూలాలను, భూగర్భ నెట్‌వర్క్‌లను పూర్తిగా మట్టుబెట్టడమే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలు, భద్రతా బలగాలు ఉమ్మడిగా భారీ సోదాలకు దిగాయి..

G Krishna
Published on: 9 Aug 2026 12:11 PM IST
terror-network
X

terror-network

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద మూలాలను, భూగర్భ నెట్‌వర్క్‌లను పూర్తిగా మట్టుబెట్టడమే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలు, భద్రతా బలగాలు ఉమ్మడిగా భారీ సోదాలకు దిగాయి. బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణ పరిధిలో ఆదివారం ఉదయం నుంచి ఏకంగా 26 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిషేధిత సంస్థ 'జమాతే ఇస్లామీ' (JeI) ప్రతినిధులు, వారి అను అనుమానిత నెట్‌వర్క్‌లపై వచ్చిన పక్కా సమాచారంతో ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.

జమాతే ఇస్లామీ టార్గెట్‌గా మెరుపు దాడులు

ఉగ్రవాద నిరోధక చట్టం (UAPA) కింద నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈ విస్తృత తనిఖీలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన 'జమాతే ఇస్లామీ' సంస్థ వెనుక రహస్యంగా పనిచేస్తున్న అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్, ఉగ్ర సంస్థలకు సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్న వ్యక్తుల కదలికలను ఛేదించడమే లక్ష్యంగా భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. సోపోర్ నగరంలోని పలు ఇళ్లు, వ్యాపార సంస్థలు , కార్యాలయాల్లో జరిపిన ఈ దాడుల్లో పలు కీలక ఆర్థిక పత్రాలు, డిజిటల్ ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

గతంలోనూ ఎన్ఐఏ (NIA) విచారణ ఉధృతం

ఈ ఏడాది మే 25న కూడా జమాతే ఇస్లామీకి చెందిన ఉగ్ర నిధుల (Terror Funding) వ్యవహారంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కాశ్మీర్ లోయ వ్యాప్తంగా పలు చోట్ల సోదాలు నిర్వహించింది. శ్రీనగర్, షోపియాన్ జిల్లాల్లోని పలు విద్యాసంస్థలు, సదరు సంస్థ మాజీ చీఫ్‌ ఇళ్లతో పాటు దాని అనుబంధ ట్రస్టులపై విరుచుకుపడింది. ఆ సమయంలో జరిపిన తనిఖీల్లో తీవ్ర అభ్యంతరకరమైన ఆర్థిక లావాదేవీల పత్రాలు, అనుమానాస్పద ఎలక్ట్రానిక్ పరికరాలు అధికారులకు లభ్యమయ్యాయి.

శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా చర్యలు

జమ్మూ కాశ్మీర్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, యథేచ్ఛగా ఉగ్ర నిధులను సమకూర్చే జమాతే ఇస్లామీ మాతృ సంస్థలతో పాటు దాని అనుబంధ సంస్థల ఆర్థిక మూలాలను వేళ్లతో సహా పెకిలించేందుకు దర్యాప్తు సంస్థలు నిరంతరం నిఘా ఉంచాయి. లోయలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ చిన్న ప్రయత్నాన్నైనా ఉపేక్షించేది లేదని, భవిష్యత్తులో కూడా ఇటువంటి కఠిన చర్యలు కొనసాగుతాయని భద్రతా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story