Swatantra Bharadwaj : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత జూన్ నెలలో జరిగిన నిరసన కార్యక్రమంలో 38 ఏళ్ల వ్యక్తిపై దాడి చేసిన ఆరోపణలపై వివాదాస్పద సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ స్వతంత్ర

G Krishna
Published on: 5 Sept 2026 4:07 PM IST
Swatantra Bharadwaj
X

Swatantra Bharadwaj

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత జూన్ నెలలో జరిగిన నిరసన కార్యక్రమంలో 38 ఏళ్ల వ్యక్తిపై దాడి చేసిన ఆరోపణలపై వివాదాస్పద సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్ (21)ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బులాంద్‌షహర్‌లో అదుపులోకి తీసుకున్న భరద్వాజ్‌ను ఢిల్లీకి తరలించి, న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు అతనికి ఒక రోజు పోలీస్ కస్టడీ విధించింది.

జంతర్ మంతర్ వద్ద ఏం జరిగింది?

జూన్ 23న జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన ధర్నాకు సంజయ్ ఆజాద్ అనే వ్యక్తి తన కుమార్తెతో కలిసి హాజరయ్యారు. ఆ సమయంలో స్వతంత్ర భరద్వాజ్ , అతని అనుచరులతో జరిగిన ఘర్షణలో సంజయ్ తలకు గాయమైంది. సంఘటనా స్థలంలోనే పోలీసులు భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించినప్పటికీ, ఆ సమయంలో విడుదల చేశారు. ప్రారంభంలో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో స్వల్ప గాయాలు , అడ్డుకోవడం వంటి సాధారణ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

వివాదానికి కారణమైన సోషల్ మీడియా వ్యాఖ్యలు

ఇటీవల సోషల్ మీడియాలో స్వతంత్ర భరద్వాజ్ మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సంజయ్‌పై తాను తీవ్రంగా దాడి చేసినట్లు అతడు గొప్పగా చెప్పుకున్న వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోతో తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వడం, బాధితునికి మద్దతుగా కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరగడంతో ఈ కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది.

రాజకీయ పరిచయాల ఆరోపణలు.. పోలీసుల స్పష్టత

సోషల్ మీడియాలో భరద్వాజ్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, ఢిల్లీ నాయకుడు కపిల్ మిశ్రా వంటి రాజకీయ ప్రముఖులతో తనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించాడు. అయితే ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఖండిస్తూ, భరద్వాజ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మరోవైపు, పోలీసులు విచారణలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని, వైద్య నివేదిక ప్రకారం బాధితుడికి తగిలిన గాయం స్వల్పమైనదిగానే నమోదైందని స్పష్టం చేశారు.

అరెస్ట్ , తదుపరి విచారణ

ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి ఉత్తరప్రదేశ్‌లోని బులాంద్‌షహర్‌లో భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఢిల్లీకి తీసుకువచ్చి అరెస్ట్ చూపించి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం భరద్వాజ్‌ను కస్టడీలోకి తీసుకుని ఈ దాడి ఘటనపై సమగ్ర విచారణ కొనసాగిస్తున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story