CJP : జంతర్ మంతర్ వద్ద మళ్లీ టెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు.!

CJP : విద్యార్థులు , ఆందోళనకారులపై నమోదైన కేసులు, ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో తమ ఆందోళనను తిరిగి ప్రారంభిస్తామని కాక్రోచ్

G Krishna
Updated on: 30 July 2026 10:36 AM IST
Jantar-Mantar
X

Jantar-Mantar

CJP : విద్యార్థులు , ఆందోళనకారులపై నమోదైన కేసులు, ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో తమ ఆందోళనను తిరిగి ప్రారంభిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) హెచ్చరించిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ నిరసన ప్రదేశంలో పోలీసులు భారీగా భద్రతను పెంచారు. నిరసనకారులు పరిమితి దాటి ముందుకు రాకుండా, బారికేడ్లను తొలగించకుండా ఉండేందుకు వీలుగా వేదికకు ఇరువైపులా ఉన్న ఇనుప బారికేడ్లను వెల్డింగ్ చేసి గట్టిగా అనుసంధానిస్తున్నారు.

కేంద్రం మాట తప్పిందంటూ తీవ్ర ఆరోపణలు

ఆందోళనకారులపై ఎలాంటి న్యాయపరమైన లేదా చట్టపరమైన చర్యలు తీసుకోబోమని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని సీజేపీ నాయకత్వం ఆరోపించింది. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదు చేయడం ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని పార్టీ ప్రతినిధి అశుతోష్ రాంకా పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వందలాది మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించిన ఆయన, విద్యార్థులపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే రద్దు చేయాలని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని , ఇరు వర్గాల మధ్య జరిగిన ఒప్పంద పత్రాన్ని బహిరంగపరచాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల ఆగ్రహం తగ్గేదే లేదు.. అభిజీత్ దిప్కే

ఈ పరిణామాలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థులను మళ్లీ వీధుల్లోకి వచ్చేలా చేస్తోందని విమర్శించారు. విద్యార్థుల ఆక్రోశం కేవలం ఒక మంత్రి రాజీనామాతో తీరిపోయేది కాదని, అది మొత్తం ప్రభుత్వ వ్యవస్థపైనేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే తీరు మార్చుకోకపోతే విద్యార్థులే దానికి తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

న్యాయ పోరాటం కోసం రూ.1 కోటి నిధి.. కపిల్ సిబల్ మద్దతు

మరోవైపు, అక్రమ కేసులను ఎదుర్కొంటున్న విద్యార్థులకు, నిరసనకారులకు ఉచితంగా న్యాయసహాయం అందించేందుకు సీజేపీ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా 'సాక్షి' (SAAKSHI) పేరుతో డిజిటల్ సాక్ష్యాలను సేకరించే ఆన్‌లైన్ వేదికను , దేశవ్యాప్త లీగల్ ఎయిడ్ సెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ న్యాయ పోరాటానికి మద్దతుగా రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ రూ. 1 కోటి రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో సీజేపీ తమ 36 రోజుల సుదీర్ఘ నిరసనను జులై 25న తాత్కాలికంగా విరమించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కేసుల ఎత్తివేత విషయంలో చిక్కుముడి పడటంతో జంతర్ మంతర్ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story