Government Jobs: 3000 మంది ఉద్యోగులకు భారీ ఊరట.. 22 రిక్రూట్‌మెంట్ పరీక్షల రద్దుపై హైకోర్టు స్టే
Government Jobs: జార్ఖండ్‌లో ఏకంగా 3000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఎంపికైన అభ్యర్థులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది
Government Jobs
Government Jobs: జార్ఖండ్ ప్రభుత్వం ఇటీవల 22 విభిన్న రిక్రూట్మెంట్ పరీక్షలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పేపర్ లీకేజ్ ఆరోపణల నెపంతో హేమంత్ సోరెన్ ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహించిన పరీక్షలన్నింటినీ రద్దు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. దీనివల్ల అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ జడ్జిలు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, డిప్యూటీ కలెక్టర్లు, జేఎస్ఎస్సీ-సిజిఎల్ ద్వారా ఎంపికైన దాదాపు 3000 మంది అర్హులైన ఉద్యోగులు వీధిపాలయ్యే పరిస్థితి వచ్చింది. విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధిస్తూ, బాధితులందరినీ వెంటనే విధుల్లో చేర్చుకోవాలని ఆదేశించింది.
రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని స్పష్టం
అభ్యర్థుల వైపు నుంచి దాఖలైన వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ప్రాథమిక సూత్రాలను గుర్తుచేసింది. ప్రతి అభ్యర్థికి వ్యక్తిగతంగా విచారణ అవకాశం ఇవ్వకుండా, ఎవరు అక్రమాలకు పాల్పడ్డారో నిరూపించకుండా ఒకేసారి 22 పరీక్షలను రద్దు చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన కీలక తీర్పులను ఉదహరిస్తూ.. నేరానికి పాల్పడిన 'దాగి' అభ్యర్థులను, నిజాయితీగా రాసిన 'బెదాగ్' అభ్యర్థులను వేర్వేరుగా గుర్తించే అవకాశం ఉన్నప్పుడు మొత్తం పరీక్షలనే రద్దు చేయడం సరికాదని అభిప్రాయపడింది.
సిఐడి విచారణ - దోషుల వేట దిశగా అడుగులు
ఈ వ్యవహారంలో తదుపరి చర్యల కోసం రాష్ట్ర క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి), స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) లకు బాధ్యతలు అప్పగించే యోచనలో కోర్టు ఉంది. అక్రమాల వల్ల లబ్ధి పొందిన వారి పూర్తి జాబితాను రూపొందించి కేవలం వారి నియామకాలను మాత్రమే రద్దు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనివల్ల కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన వేలాది మందికి న్యాయం జరిగే అవకాశం ఏర్పడింది. దాదాపు 26 రోజుల పాటు విద్యార్థి సంఘాలు రోడ్లపైకి వచ్చి చేసిన ఆందోళనల నేపథ్యంలో ఈ తీర్పు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సర్కార్
హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులు హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. దీంతో ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రైవేట్ పరీక్షల నిర్వహణ సంస్థ అవినీతికి పాల్పడటం వల్ల నియామక ప్రక్రియ విశ్వసనీయత కోల్పోయిందని అత్యున్నత న్యాయస్థానంలో వాదించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు ఐఏఎస్ అధికారి అమితాబ్ కౌశల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ పరీక్షల భద్రతకు సంబంధించి ఇచ్చే నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో రిక్రూట్మెంట్ విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.




