Snake Bite : హాస్టల్‌లోకి దూరిన పాము.. నిద్రలో ఉన్న విద్యార్థినులకు కాటు..
Snake Bite : జార్ఖండ్‌లోని లోహర్దగా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాల గర్ల్స్ హాస్టల్‌లోకి అర్ధరాత్రి వేళ అత్యంత
snake-bite
Snake Bite : జార్ఖండ్‌లోని లోహర్దగా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాల గర్ల్స్ హాస్టల్‌లోకి అర్ధరాత్రి వేళ అత్యంత విషపూరితమైన కట్లపాము (Krait) చొరబడింది. గాఢ నిద్రలో ఉన్న నలుగురు విద్యార్థినులను ఆ పాము కాటు వేయడంతో, 13 ఏళ్ల బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు విద్యార్థినుల పరిస్థితి అత్యంత విషమంగా మారింది.
అర్ధరాత్రి వేళ ఊహించని ప్రమాదం
లోహర్దగా జిల్లా రోచో మహువాతోలిలోని 'సన్వాసిరా హయ్యర్ సెకండరీ రెసిడెన్షియల్ స్కూల్'లో మంగళవారం రాత్రి ఈ దారుణం జరిగింది. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినులు ఎప్పటిలాగే రాత్రి భోజనం ముగించుకుని తమ గదుల్లో నిద్రపోయారు. అయితే, రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఒక కట్లపాము గదిలోకి ప్రవేశించింది. అది మొదట వర్ష ఓరాన్ అనే విద్యార్థినిని కాటు వేసింది. దాంతో ఆ బాలిక గట్టిగా కేకలు వేయడంతో గదిలోని మిగిలిన విద్యార్థినులు ఒక్కసారిగా నిద్రలేచారు.
వరుసగా నలుగురిపై దాడి
అసలేం జరుగుతుందో మిగతా వారు గ్రహించి, స్పందించే లోపే ఆ విషసర్పం గదిలోని మిగతా వారిపై కూడా దాడి చేసింది. వర్ష ఓరాన్‌తో పాటు అక్కడే ఉన్న అనీషా ఓరాన్, మనీషా కుమారి , ఫుల్మనియా ఓరాన్ అనే మరో ముగ్గురు అమ్మాయిలను కూడా ఆ పాము వరుసగా కాటు వేసింది. విద్యార్థినుల అరుపులు విన్న హాస్టల్ ఉపాధ్యాయులు, సిబ్బంది వెంటనే గదికి చేరుకుని తీవ్ర భయాందోళనల నడుమ నలుగురు విద్యార్థినులను రాత్రికి రాత్రే లోహర్దగా సదర్ ఆసుపత్రికి తరలించారు.
ఒకరు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం
ఆసుపత్రికి తరలించే మార్గంలోనే విషం శరీరామంతటా పాకడంతో మొదట కాటుకు గురైన వర్ష ఓరాన్ (13) అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మిగిలిన ముగ్గురు విద్యార్థినుల్లో ఫుల్మనియా ఓరాన్ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారడంతో, మెరుగైన వైద్యం కోసం ఆమెను రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. మిగతా ఇద్దరు విద్యార్థినులు లోహర్దగా సదర్ ఆసుపత్రిలోనే అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో సదరు నివాస పాఠశాలలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవడమే కాకుండా, విద్యార్థిని మృతితో స్థానికంగా పెద్ద ఎత్తున విషాదం నిండింది.




