Jharkhand: దారుణం..మహిళను ముక్కలుముక్కలుగా నరికి వంట చేసిన నరరూప రాక్షసుడు
జార్ఖండ్‌లోని సరాయికేలా ఖర్సావాన్ జిల్లాలో గిరిజన మహిళ దారుణ హత్యకు గురైంది. మేళాలో హడియా విక్రయించేందుకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. వెతుకుతుండగా తీవ్ర గాయాలతో మృతదేహం లభించింది.
Jharkhand Crime
Jharkhand: జార్ఖండ్‌లో అత్యంత దారుణమైన హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. సరాయికేలా-ఖర్సావాన్ జిల్లాలో సుమారు 45 ఏళ్ల గిరిజన మహిళను ఓ వ్యక్తి హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతటితో ఆగకుండా ఆమె మృతదేహం నుంచి కొన్ని శరీర భాగాలను వేరు చేసి, ఇంటి వెనుక ఉన్న కడాయిలో వండినట్లు సమాచారం. ఈ ఘటనతో జొంబరో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మహిళకు బంధువైన పౌలుష్ ముండా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రాత్రైనా ఇంటికి రాకపోవడంతో వెతుకులాట
సరాయికేలా-ఖర్సావాన్ జిల్లాలోని కుచాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జొంబరో గ్రామంలో ఈ ఘటన జరిగింది. మంగళవారం రాత్రి గ్రామంలో హాకీ టోర్నమెంట్‌తో పాటు మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 45 ఏళ్ల మహిళ హడియా అనే సంప్రదాయ పానీయం విక్రయించేందుకు వెళ్లింది. అయితే రాత్రి చాలా సమయం గడిచినా ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన భర్త, కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు.
కనిపించిన మృతదేహంతో గ్రామంలో కలకలం
కుటుంబ సభ్యులు వెతుకుతుండగా మహిళ మృతదేహం అత్యంత దారుణమైన స్థితిలో కనిపించింది. శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో పాటు కొన్ని భాగాలు కనిపించలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నిందితుడు పదునైన ఆయుధంతో మహిళను హత్య చేసి, ఆ తర్వాత మృతదేహం నుంచి కొన్ని భాగాలను వేరు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిని ఇంటి వెనుక ఉన్న కడాయిలో వండినట్లు కూడా పోలీసులు విచారిస్తున్న సమాచారం చెబుతోంది. ఈ విషయం బయటకు రావడంతో గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
బంధువుపైనే అనుమానం
ఘటన గురించి సమాచారం అందుకున్న దల్భంగా అవుట్‌పోస్ట్ పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో పౌలుష్ ముండా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు మృతురాలికి వరుసకు బావ అవుతాడని సమాచారం. హత్యకు గల కారణాలు ఏమిటి? ఈ ఘటనలో మరెవరైనా పాల్గొన్నారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
అత్యాచారం జరిగిందా?
మహిళ హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ చేయలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హత్యకు దారితీసిన పరిస్థితులు, మృతదేహంపై జరిగిన దాడి, ఇతర ఆధారాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ ఘటనతో జొంబరో గ్రామంలో విషాదంతో పాటు భయాందోళనలు నెలకొన్నాయి.




