హాస్టల్ రూమ్‌లో ఘోర విషాదం: నిద్రలో ఉన్న నలుగురిని కాటేసిన పాము..
Jharkhand: జార్ఖండ్‌లోని లోహర్‌దగా జిల్లాలో గల ఓ ప్రైవేట్ స్కూల్ బాలికల హాస్టల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
హాస్టల్ రూమ్‌లో ఘోర విషాదం: నిద్రలో ఉన్న నలుగురిని కాటేసిన పాము..
Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల బాలికల హాస్టల్‌లో అర్ధరాత్రి ఊహించని విషాదం చోటుచేసుకుంది. విద్యార్థినులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో గదిలోకి దూరిన ఓ విషపూరితమైన కట్లపాము.. నలుగురు బాలికలను కాటేసింది. ఈ అత్యంత విషాదకరమైన ఘటనలో 13 ఏళ్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు బాలికలు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.
లోహర్‌దగా జిల్లాలోని సన్‌వసిరా హయ్యర్ సెకండరీ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి సుమారు 11 గంటల సమయంలో బాలికలంతా తమ గదిలో నిద్రిస్తున్నారు. అదే సమయంలో గదిలోకి ప్రవేశించిన విషపూరితమైన పాము.. మొదట ఒక అమ్మాయిని కాటేసింది. పాము కాటుకు గురైన ఆ బాలిక నొప్పితో గట్టిగా కేకలు వేయడంతో, అదే గదిలో నిద్రిస్తున్న మిగతా ముగ్గురు విద్యార్థినులు ఉలిక్కిపడి లేచారు. వారు తేరుకునేలోపే ఆ పాము వారిని కూడా కాటేసింది.
బాలికల ఆర్తనాదాలు విన్న హాస్టల్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని, అపస్మారక స్థితిలోకి వెళ్తున్న విద్యార్థినులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఒక విద్యార్థిని మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మిగతా ముగ్గురు బాలికలకు ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. పాఠశాల యాజమాన్యం, హాస్టల్ వార్డెన్ల కనీస పర్యవేక్షణ లేకపోవడం, వారి నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణం పోయిందని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ వద్ద ఆందోళనకు దిగిన పేరెంట్స్.. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




