Jharkhand: చీరకట్టుతో పరుగెత్తి వైరల్.. కొలువుకు అడుగు దూరంలో నిరాశ మిగిల్చిన కవిత కథ!

Jharkhand: సోషల్ మీడియాలో చీరకట్టుతో పరుగెత్తి వైరల్ అయిన ఝార్ఖండ్ మహిళ కవితకు హోంగార్డు ఉద్యోగం దక్కలేదు. రన్నింగ్‌లో అదరగొట్టినా, హైజంప్‌లో విఫలమవడంతో ఆమె ఆశలు అడియాసలయ్యాయి.

Arun Chilukuri
Published on: 26 Oct 2026 3:54 PM IST
Jharkhand
X

Jharkhand: చీరకట్టుతో పరుగెత్తి వైరల్.. కొలువుకు అడుగు దూరంలో నిరాశ మిగిల్చిన కవిత కథ!

సోషల్ మీడియాలో చీరకట్టుతో, చెప్పులు లేకుండా పరుగెత్తి దేశవ్యాప్తంగా ఎందరి హృదయాలనో గెలుచుకున్న ఝార్ఖండ్‌కు చెందిన కవిత కథ నిరాశజనకంగా ముగిసింది. తన కుటుంబ కష్టాలను తీరుస్తుందనుకున్న హోంగార్డు ఉద్యోగ నియామక పరీక్షలో ఆమెకు తీవ్ర నిరాశ ఎదురైంది. 1600 మీటర్ల పరుగు పందెంలో అద్భుత ప్రతిభ కనబరిచినప్పటికీ, హైజంప్‌లో విఫలమవడంతో ఉద్యోగం పొందే అవకాశాన్ని ఆమె కోల్పోయారు.

ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాకు చెందిన ఇద్దరు పిల్లల తల్లి కవిత భర్త కొన్నేళ్ల క్రితం మరణించారు. దీంతో ఇద్దరు పిల్లలు, వృద్ధులైన అత్తామామల సంరక్షణ బాధ్యత ఆమెపై పడింది. కుటుంబ పోషణ కోసం ఇటీవల జరిగిన హోంగార్డు నియామక పరీక్షకు ఆమె సిద్ధమయ్యారు. సిడో-కన్హు జిల్లా మైదానంలో ఓ ప్రైవేట్ అకాడమీ నిర్వహించిన ట్రయల్ రన్‌లో పేదరికం కారణంగా కనీసం బూట్లు కూడా లేకపోయినా.. ఏకంగా చీరకట్టుతోనే ఆమె పరుగెత్తారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కవిత రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారారు. ఆమె దీనస్థితిని చూసి పలువురు దాతలు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చారు.

సోషల్ మీడియా ద్వారా వచ్చిన మద్దతుతో ఎంతో ఆశలతో హోంగార్డు రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరైన కవిత.. పరుగు పందెంలో అంచనాలను నిజం చేశారు. 10 నిమిషాల్లో పూర్తి చేయాల్సిన 1600 మీటర్ల పరుగును కేవలం 8 నిమిషాల 57 సెకన్లలోనే పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె ఉద్యోగానికి ఎంపికవడం ఖాయమని అంతా భావించారు.

అయితే, తర్వాతి దశ అయిన హైజంప్ పరీక్షలో ఆమె నిరాశపరిచారు. అధికారులు మూడుసార్లు అవకాశం కల్పించినప్పటికీ, ఆమె నిర్దేశిత ఎత్తును దాటలేకపోయారు. దీంతో నిబంధనల ప్రకారం ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. ఈ పరీక్షకు మొత్తం 930 మంది మహిళా అభ్యర్థులు హాజరయ్యారు.

కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగిన కవిత కథ ఇలా ముగియడం ఆమె శ్రేయోభిలాషులను, నెటిజన్లను కలచివేసింది. అయినప్పటికీ, ఆమె కఠిన పరిస్థితుల్లో చూపిన పట్టుదల, సంకల్పం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోందని ప్రశంసిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.