J&K: అమర్‌నాథ్ యాత్ర వేళ ఉగ్ర అలర్ట్.. కశ్మీర్‌లో భారీ తనిఖీలు
జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు వలస కార్మికుల హత్య తర్వాత భద్రతా బలగాలు భారీ గాలింపు చేపట్టాయి. 3 వేల మంది అనుమానితుల విచారణ.
Jammu Kashmir Terror Attack
జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు వలస కార్మికుల హత్య ఘటనపై భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికులు దీపక్, భూపేంద్రను హత్య చేసిన ఉగ్రవాదుల కోసం దక్షిణ కశ్మీర్ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
అమర్‌నాథ్ యాత్ర మార్గంలో ఉన్న కుల్గామ్ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. దాడి అనంతరం ఉగ్రవాదులు పరారైనట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనకు వారం రోజుల ముందు అనంత్‌నాగ్‌లోని రద్దీగా ఉండే మార్కెట్‌లో పోలీసు అధికారి ఆశిక్ హుస్సేన్ ఖురేషిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. వరుసగా రెండు లక్ష్య దాడులు జరగడంతో లోయలో భద్రతపై ఆందోళనలు పెరిగాయి.
ఉగ్రవాదుల కదలికలను అడ్డుకునేందుకు గత వారం రోజులుగా 3 వేల మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
అనంత్‌నాగ్‌లోని జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం సమీపంలో ఏకే-47తో వచ్చిన ఓ ఉగ్రవాది పోలీసు అధికారిపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఘటన సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. ఈ ఘటన తర్వాత భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు.
వలస కార్మికులు కశ్మీర్‌లో ఇటుక బట్టీలు, యాపిల్ తోటలు, వ్యవసాయ పనులు, నిర్మాణ రంగాల్లో పనిచేస్తుంటారు. కుల్గామ్‌లోని కెలమ్ ప్రాంతంలో జరిగిన దాడి కారణంగా అక్కడ పనిచేస్తున్న వేలాది మంది వలస కార్మికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఘటన అనంతరం జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పోలీసు, భద్రతా బలగాలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. భద్రతా ప్రోటోకాల్స్ (ఎస్‌ఓపీలు)ను పునఃపరిశీలించాలని ఆదేశించారు.




