ఝార్ఖండ్‌లో ఉద్ధృతమైన పేపర్ లీక్ ఆందోళనలు.. 'జేపీఎస్‌సీ' రద్దుకు డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్ష!

JPSC Paper Leak Protest: జేపీఎస్‌సీ ప్రిలిమ్స్‌ పేపర్ లీక్‌పై ఝార్ఖండ్‌లో ఆందోళనలు తీవ్రమయ్యాయి.

Arun Chilukuri
Published on: 3 Aug 2026 12:45 PM IST
ఝార్ఖండ్‌లో ఉద్ధృతమైన పేపర్ లీక్ ఆందోళనలు.. జేపీఎస్‌సీ రద్దుకు డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్ష!
X

ఝార్ఖండ్‌లో ఉద్ధృతమైన పేపర్ లీక్ ఆందోళనలు.. 'జేపీఎస్‌సీ' రద్దుకు డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్ష!

JPSC Paper Leak Protest: నీట్ పేపర్ లీక్ వివాదంతో దేశ రాజధాని ఢిల్లీలో చెలరేగిన ఆందోళనల తరహాలోనే ప్రస్తుతం ఝార్ఖండ్ రాష్ట్రంలోనూ నిరుద్యోగుల నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) ప్రిలిమినరీ పరీక్షల్లో భారీగా అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ రాజధాని రాంచీలో ప్రారంభమైన విద్యార్థుల ఉద్యమం రోజురోజుకూ ఉద్ధృతంగా మారుతోంది.

అవకతవకలు జరిగిన జేపీఎస్‌సీ నియామక పరీక్షను వెంటనే రద్దు చేయాలని, ఈ కుంభకోణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) చేత సమగ్ర విచారణ జరిపించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా నియామక ప్రక్రియలో పారదర్శకత తీసుకొచ్చేలా బోర్డులో సంస్కరణలు చేపట్టాలని కోరుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ప్రముఖ విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో ఆదివారం రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.

ఈ సందర్భంగా దేవేంద్రనాథ్ మహతో మాట్లాడుతూ.. ‘‘జేపీఎస్‌సీ ఫలితాలు విడుదలైన వెంటనే ముఖ్యమంత్రిని కలసి పేపర్ లీక్‌కు సంబంధించిన అన్ని ఆధారాలను అందించాం. వారాలు గడుస్తున్నా ప్రభుత్వం గానీ, జేపీఎస్‌సీ యాజమాన్యం గానీ స్పందించకపోవడం దారుణం. ఈ నిర్లక్ష్యంతో విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. బాధ్యులైన నిందితులకు కఠిన శిక్ష పడే వరకు మా పోరాటం ఆగదు’’ అని స్పష్టం చేశారు.

జేఎస్‌ఎస్‌సీ సీజీఎల్, జేపీఎస్‌సీ పరీక్షలకు సంబంధించి సోషల్ మీడియాలో ఓఎమ్‌ఆర్ (OMR) షీట్లు వైరల్ అయిన తర్వాతే ప్రభుత్వం నామమాత్రంగా స్పందించిందని విద్యార్థులు మండిపడ్డారు. బోర్డు అధికారుల అలసత్వం, పాలనాపరమైన లోపాల వల్ల తమ భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాంచీలో జరుగుతున్న ఈ ఆందోళనలకు పలు రాజకీయ, సామాజిక వర్గాలు తమ మద్దతును ప్రకటించాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story