ప్రేమికులకు అండగా కర్ణాటక సర్కార్: పరువు హత్యలు చేస్తే మరణశిక్ష.. విప్లవాత్మక బిల్లుకు గ్రీన్ సిగ్నల్!
Honor Killing: పరువు హత్యలకు అడ్డుకట్ట వేసేందుకు కర్ణాటక ప్రభుత్వం 'వివాహ ఎంపిక స్వేచ్ఛ బిల్లు-2026'ను తీసుకువచ్చింది.
ప్రేమికులకు అండగా కర్ణాటక సర్కార్: పరువు హత్యలు చేస్తే మరణశిక్ష.. విప్లవాత్మక బిల్లుకు గ్రీన్ సిగ్నల్!
Honor Killing: కులం, మతం పేరుతో జరుగుతున్న పరువు హత్యలకు (Honor Killings) అడ్డుకట్ట వేసేందుకు కర్ణాటక ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రేమికుల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ, రాజ్యాంగబద్ధమైన వివాహ స్వేచ్ఛను గౌరవించే దిశగా ‘కర్ణాటక వివాహ ఎంపిక స్వేచ్ఛ, గౌరవం పేరిట జరిగే నేరాల నిరోధక బిల్లు-2026’కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
బిల్లులోని కీలక ముఖ్యాంశాలు:
తక్షణ రక్షణ: తమకు ప్రాణహాని ఉందని భావించే ప్రేమ జంటలు పోలీసులను ఆశ్రయిస్తే, ఫిర్యాదు అందిన 6 గంటల్లోనే వారికి రక్షణ కల్పించాలి.
సేఫ్ హౌస్‌లు: రక్షణ కోరిన జంటల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 'సేఫ్ హౌస్'లను ఏర్పాటు చేయనుంది. జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్స్, 24 గంటల హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులోకి రానున్నాయి.
కఠిన శిక్షలు: పరువు పేరుతో దాడులకు పాల్పడితే కనిష్టంగా 5 ఏళ్ల నుంచి గరిష్టంగా మరణశిక్ష వరకు విధించేలా చట్టాన్ని పటిష్టం చేశారు. సామాజిక బహిష్కరణ విధించినా అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది.
మేజర్లకు పూర్తి స్వేచ్ఛ: 18 ఏళ్లు నిండిన యువతి, 21 ఏళ్లు నిండిన యువకుడు పరస్పర అంగీకారంతో వివాహం చేసుకుంటే, తల్లిదండ్రులు లేదా కుల పెద్దల అనుమతితో పనిలేదని ఈ బిల్లు స్పష్టం చేస్తోంది.
బసవన్న స్ఫూర్తితో నామకరణం:
12వ శతాబ్దపు గొప్ప సంఘ సంస్కర్త బసవన్న బోధించిన ‘ఇవా నమ్మవ’ (అతడు మనవాడే) అనే వచనం స్ఫూర్తితో ఈ బిల్లుకు పేరు పెట్టడం విశేషం. కులమతాలకు అతీతంగా మానవత్వానికే పెద్దపీట వేయాలనే సందేశాన్ని ఈ చట్టం ప్రతిబింబిస్తోంది.
దేశవ్యాప్తంగా చర్చ:
దేశంలో పరువు హత్యలు పెరుగుతున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవనుంది. కేవలం చట్టం చేయడమే కాకుండా, బాధితులకు ఆశ్రయం కల్పించేలా 'సేఫ్ హౌస్'ల వంటి మౌలిక వసతులు కల్పించడంపై సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


