Karnataka: కర్ణాటక రాజకీయంలో బిగ్ ట్విస్ట్.. రేపు సీఎం సిద్ధరామయ్య రాజీనామా?
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Karnataka: కర్ణాటక రాజకీయంలో బిగ్ ట్విస్ట్.. రేపు సీఎం సిద్ధరామయ్య రాజీనామా?
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధిష్టానం వద్ద సాగుతున్న చర్చల పర్వం ముగింపు దశకు చేరినట్లు కనిపిస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రేపు (గురువారం) తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయి.
రాజీనామా నిర్ణయానికి ముందు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రేపు ఉదయం తన క్యాబినెట్ సహచరులతో అత్యవసర 'బ్రేక్ ఫాస్ట్ మీటింగ్' ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తన రాజీనామాకు గల కారణాలను మంత్రులకు వివరించి, అందరికీ ధన్యవాదాలు తెలపనున్నట్లు సమాచారం. ఈ భేటీ ముగిసిన వెంటనే ఆయన నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు.
ఈ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్‌వీ దేశ్‌పాండే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరింత దుమారం రేపుతున్నాయి. "తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు సీఎం సిద్ధరామయ్య స్వయంగా నాతో చెప్పారు" అని దేశ్‌పాండే మీడియా వద్ద లీక్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు సిద్ధరామయ్య స్థానంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇందుకు బలం చేకూరుస్తూ, ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో కీలక చర్చలు ముగించుకుని డీకే సురేష్ బెంగళూరుకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరులోని డీకే శివకుమార్ నివాసం వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు, కార్యకర్తలు అప్పుడే బాణసంచా కాలుస్తూ సంబరాలు మొదలుపెట్టారు. సిద్ధరామయ్య రాజీనామా అధికారికంగా ఖరారైతే.. కర్ణాటకలో సరికొత్త 'డీకే మార్క్' పాలన మొదలుకానుంది.




