పెట్రోల్‌లో మితిమీరిన ఇథనాల్ కల్తీ.. కర్ణాటక వర్సెస్ కేంద్రం.. కేరళలోనూ కలకలం

Ethanol Blending: పెట్రోల్ ఉత్పత్తుల నాణ్యతపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం సాధారణమే అయినప్పటికీ.

G Krishna
Published on: 9 Nov 2026 8:44 PM IST
Ethanol Blending
X

పెట్రోల్‌లో మితిమీరిన ఇథనాల్ కల్తీ.. కర్ణాటక వర్సెస్ కేంద్రం.. కేరళలోనూ కలకలం

Ethanol Blending: పెట్రోల్ ఉత్పత్తుల నాణ్యతపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం సాధారణమే అయినప్పటికీ, నిర్ణీత పరిమితిని దాటి మితిమీరి కలపడం వల్ల వాహనాల ఇంజన్లు దెబ్బతినడమే కాకుండా మైలేజీ దారుణంగా పడిపోతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం , కేంద్ర ప్రభుత్వ సంస్థల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది.

20 శాతానికి బదులు 30 శాతం ఇథనాల్

కర్ణాటక వ్యాప్తంగా 67 ప్రాంతాల నుంచి సేకరించిన పెట్రోల్ నమూనాలను పరీక్షించగా.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన 20 శాతం ఇథనాల్ పరిమితిని దాటి ఏకంగా 30 శాతం వరకు ఇథనాల్ కలిపినట్లు తేలిందని కర్ణాటక ప్రభుత్వం సంచలన ఆరోపణ చేసింది. ఈ తీవ్రమైన వ్యత్యాసంపై కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో కాకుండా స్వతంత్ర సంస్థల ద్వారా నిష్పక్షపాతంగా రీ-టెస్టింగ్ జరిపించాలని కర్ణాటక డిమాండ్ చేసింది.

ఆరోపణలను ఖండించిన ఆయిల్ కంపెనీలు

మరోవైపు కర్ణాటక ప్రభుత్వ ఆరోపణలను ప్రభుత్వ రంగానికి చెందిన చమురు సంస్థలు (Oil Companies) తీవ్రంగా ఖండించాయి. నిబంధనల ప్రకారమే ఇథనాల్ బ్లెండింగ్ జరుగుతోందని స్పష్టం చేశాయి. ఇదే సమయంలో బీజేపీ కూడా కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన శాంపిల్ టెస్టింగ్ విధానంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించింది.

కేరళలో పెట్రోల్ నాణ్యతపై దాడులు

కర్ణాటకలో వెలుగుచూసిన ఈ వివాదంతో పొరుగున ఉన్న కేరళ రాష్ట్రం కూడా తీవ్ర అప్రమత్తమైంది. వాహనదారులు ఇంజన్ సమస్యలు, మైలేజీ తగ్గుదలపై ఫిర్యాదులు చేయడంతో కేరళ ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ప్రాథమికంగా నాలుగు జిల్లాల్లోని పెట్రోల్ బంకుల్లో ఇంధన నాణ్యతా తనిఖీలు (Fuel Quality Inspections) ప్రారంభించింది. సరిహద్దు రాష్ట్రాల్లో చెలరేగిన ఈ ఇథనాల్ వివాదం ఇప్పుడు సాధారణ వాహనదారుల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.