పెళ్లి పేరుతో పిలిచి.. ప్రియురాలిని జలపాతం దగ్గర కడతేర్చాడు
Gokak Falls: నాలుగేళ్లపాటు నిండుగా ప్రేమించి, పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకంతో అతడి వెంటే నడిచిన ఆ యువతికి చివరికి మృత్యువే ఎదురైంది.
పెళ్లి పేరుతో పిలిచి.. ప్రియురాలిని జలపాతం దగ్గర కడతేర్చాడు
Karnataka Gokak Falls: నాలుగేళ్లపాటు నిండుగా ప్రేమించి, పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకంతో అతడి వెంటే నడిచిన ఆ యువతికి చివరికి మృత్యువే ఎదురైంది. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ, తమ పెళ్లి విషయమై మనసారా మాట్లాడుకుందామని ప్రియుడు పిలిస్తే చాలు.. ఆ వలలో పడి తన ప్రాణాలకే ముప్పు వస్తుందని ఆ దుర్బల హృదయం ఊహించలేకపోయింది. కర్ణాటకలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన అందరినీ కలచివేస్తోంది. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన ఒక కామాంధుడి అగత్యానికి 23 ఏళ్ల నిండు నూరేళ్ల జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది.
నమ్మకద్రోహానికి బలైన నిస్సహాయ యువతి
కర్ణాటకకు చెందిన 23 ఏళ్ల రక్షితా సరికర్, అదే ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల బసప్ప సతన్నవర్ గత నాలుగేళ్లుగా గాఢంగా ప్రేమించుకున్నారు. బసప్ప బీహార్‌లోని సశస్త్ర సీమా బల్ (SSB) 21వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా దేశ రక్షణ విధుల్లో ఉన్నాడు. తాను ప్రేమించిన రక్షితను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అయితే కొద్ది రోజులుగా పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ఇద్దరి మధ్య మనస్పర్థలు, వాగ్వాదాలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే అక్టోబర్ 28న భవిష్యత్తు గురించి, పెళ్లి గురించి ప్రశాంతంగా మాట్లాడుకుందామంటూ బసప్ప రక్షితను గోకాక్ జలపాతానికి తీసుకెళ్లాడు. కానీ, తనను నమ్మి వెంట వచ్చిన ప్రియురాలిని కడతేర్చాలనే రాక్షస ఆలోచనను ఆ కిరాతకుడు ముందే మనసులో దాచుకున్నాడు.
జలపాతం సాక్షిగా ప్రియురాలి హత్య
గోకాక్ జలపాతం అందాలను చూడటానికి వెళ్లిన ఆ జంట మధ్య మరోసారి వివాదం చెలరేగింది. పెళ్లి చేసుకోమంటూ అడిగినందుకు ఆ కాకినాటి ప్రియుడిలో మానవత్వం చచ్చిపోయింది. ఆగ్రహంతో ఊగిపోయిన బసప్ప.. రక్షితపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ముందుగా ఆమె చెవిపై బలంగా కొట్టి, ఆ తర్వాత తన చేతులతోనే ఆమె గొంతును నులిమి కిరాతకంగా హతమార్చాడు. తాను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువతి ఊపిరి ఆగిపోయే వరకు అతనికి కనికరం కలగలేదు. ప్రాణం పోయాక కూడా పశ్చాత్తాపం లేకుండా ఆమె నిర్జీవ దేహాన్ని జలపాతం సమీపంలోని ఒక కొండపై పడేసి అక్కడి నుంచి పారిపోయాడు.
కుటుంబ సభ్యుల ఆందోళన.. వెలుగులోకి వచ్చిన నిజాలు
రక్షిత ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో నవంబర్ 1న స్థానిక పోలీసులకు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించగా, అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. రక్షిత ఆఖరుగా ఎవరిని కలిసింది, ఎక్కడికి వెళ్లిందన్న కోణంలో ఆరా తీయగా బసప్ప బండారం బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా తాను చేసిన దారుణాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఒక యువతి నమ్మిన ప్రేమే ఆమెపాలిట మృత్యువుగా మారడం స్థానికంగా తీవ్ర విషదాన్ని నింపింది. గుండెల్ని పిండేస్తున్న ఈ దారుణ ఘటనపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




