Landslides : కొండచరిపడి ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం.!

Landslides : కర్ణాటకలోని మలేనాడు (Malnad) ప్రాంతాన్ని గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న

G Krishna
Published on: 3 Aug 2026 8:02 AM IST
karnataka landslide
X

karnataka landslide

Landslides : కర్ణాటకలోని మలేనాడు (Malnad) ప్రాంతాన్ని గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల ధాటికి కొండప్రాంతాలు తీవ్రంగా కోతకు గురవుతున్నాయి. ఈ క్రమంలోనే శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకాలో ఆదివారం తెల్లవారుజామున ఒక ఘోర విపత్తు సంభవించింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మట్టి దిబ్బల కింద చిక్కుకుని దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని రేకెత్తించింది.

నిద్రలోనే కబళించిన మృత్యువు

తీర్థహళ్లి పరిధిలోని ఇందిరా నగర్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. బాధితులు కొండపాదం వద్ద తాత్కాలికంగా ఒక షెడ్డు నిర్మించుకుని నివాసముంటున్నారు. వర్షం తీవ్రత పెరగడంతో కొండపై నుంచి భారీగా మట్టి, రాళ్లు ఒక్కసారిగా ఆ షెడ్డుపైకి విరిగిపడ్డాయి. ప్రమాదం అర్ధరాత్రి వేళ, అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో జరగడంతో కనీసం బయటకు తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.

ఈ ఘటనలో కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని కొక్కరేగారు గ్రామానికి చెందిన మల్లికార్జున (35), ఆయన భార్య నాగవేణి (28), వీరి మూడేళ్ల చిన్నారి సంతోష్ మట్టి కింద నలిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కష్టపడి జీవనం సాగిస్తున్న ఒక నిరుపేద కుటుంబం ఇలా నిద్రలోనే సజీవ సమాధి కావడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

ఊపిరాడని సహాయక చర్యలు.. మరో షెడ్డులోని వారికి గాయాలు

ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న తీర్థహళ్లి పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే, ఆ ప్రాంతంలో వర్షం తగ్గకపోవడం, కొండ నుంచి మట్టి నిరంతరం జారిపడుతుండటంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలిగింది. భారీగా పేరుకుపోయిన మట్టిని తొలగించి, మృతదేహాలను బయటకు తీసేందుకు సిబ్బంది గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది.

ఇదే ప్రమాదంలో పక్కనే ఉన్న మరొక షెడ్డులో నివసిస్తున్న పలువురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తీర్థహళ్లిలోని జయచామరాజేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

ఎమ్మెల్యే పర్యవేక్షణ.. డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి

సంఘటనా స్థలాన్ని తీర్థహళ్లి బీజేపీ ఎమ్మెల్యే అరగ జ్ఞానేంద్ర వెంటనే సందర్శించారు. ప్రమాద తీవ్రతను పరిశీలించి, మట్టిని తొలగించే పనులను, పోలీసుల సహాయక చర్యలను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం ఆయన ప్రమాద స్థలం నుంచే కర్ణాటక ఉపముఖ్యమంత్రి డి.కే. శివకుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితిని వివరించి, ఉపాధి కోసం వచ్చి ప్రమాదంలో బలైపోయిన ఆ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం తరఫున తక్షణమే భారీ ఆర్థిక సాయం , పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

భయంలో మలేనాడు ప్రజలు

ప్రస్తుతం తీర్థహళ్లితో పాటు మలేనాడు వ్యాప్తంగా వర్షాలు ఇంకా కొనసాగుతుండటంతో కొండ ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలో గడుపుతున్నారు. ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏ కొండచరియలు విరిగిపడతాయోనని స్థానికులు వణికిపోతున్నారు. పరిస్థితుల తీవ్రతను దృష్ట్యా అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేయడంతో పాటు, కొండపాంతాలు , ప్రమాదకర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు వేగవంతం చేశారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story