DK Shivakumar: కర్ణాటక మంత్రులపై స్టింగ్ ఆపరేషన్ కలకలం: సీఎం డీకే శివకుమార్ సంచలన హెచ్చరిక
DK Shivakumar: కర్ణాటకలో మంత్రులను లక్ష్యంగా చేసుకుని దిల్లీ ఏజెన్సీలు స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నాయని సీఎం డీకే శివకుమార్ హెచ్చరించగా, ఇది డీకే నాటకమంటూ కేంద్ర మంత్రి కుమారస్వామి మండిపడ్డారు.
DK Shivakumar: కర్ణాటక మంత్రులపై స్టింగ్ ఆపరేషన్ కలకలం: సీఎం డీకే శివకుమార్ సంచలన హెచ్చరిక
DK Shivakumar: కర్ణాటక రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రులను లక్ష్యంగా చేసుకుని దిల్లీ నుంచి ప్రత్యేక ఏజెన్సీలు రంగంలోకి దిగాయని, కొందరు మంత్రులపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం రాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. మంత్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రానున్న విధానసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, జనతాదళ్ (JDS) పార్టీలు దిల్లీ నుంచి ప్రత్యేక ఏజెన్సీలను రప్పించి కేబినెట్‌లోని కీలక మంత్రులపై నిఘా పెంచాయని సీఎం తెలిపారు. ప్రస్తుతం సుమారు ఐదుగురు మంత్రుల కదలికలపై ఈ ఏజెన్సీలు నిఘా వేశాయని, వారిపై స్టింగ్ ఆపరేషన్‌కు కుట్ర జరుగుతోందని ఆయన మంత్రులతో వేర్వేరుగా చర్చించినట్లు సమాచారం.
ఇప్పటికే దాదాపు 40 మంది ఎమ్మెల్యేల ఆదాయ వనరులపై ఆరా తీసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), రానున్న రోజుల్లో మంత్రులనూ టార్గెట్ చేసి వేధించే అవకాశం ఉందని డీకే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఆ ఏజెన్సీల వివరాలను బయటపెట్టబోనని స్పష్టం చేశారు.
సీఎం డీకే శివకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రులను తన గుప్పిట్లో పెట్టుకునేందుకే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా ఈ ‘స్టింగ్ ఆపరేషన్’ నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇదివరకటి సిద్ధరామయ్య ప్రభుత్వ హయాంలో మంత్రులపై ఇలాంటి ఆపరేషన్లే చేసిన డీకే శివకుమార్.. చివరికి ఆయనే సీఎం పదవిని చేజిక్కించుకున్నారని విమర్శించారు.




