MLA Daughter: ఎస్సై చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే కూతురు!

MLA Daughter: మండ్య జిల్లా అహల్యాదేవి ఆలయంలో విధుల్లో ఉన్న మహిళా ఎస్సై బి. సవితపై బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ గౌడ కుమార్తె ఐశ్వర్య దాడి.

Naresh.k
Published on: 15 Aug 2026 10:22 AM IST
MLA Daughter
X

MLA Daughter: ఎస్సై చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే కూతురు!

Aishwarya Suresh Gowda: ఆధ్యాత్మికత, భక్తితో నిండిపోవాల్సిన ఆలయం కాస్తా వీఐపీ అహంకారానికి నిదర్శనంగా మారింది. దేవుడి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న సామాన్య భక్తుల కోసం తన విధులను ప్రాత్తాయామ్నాయంగా నిర్వహిస్తున్న ఒక మహిళా పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌పై ఎమ్మెల్యే కుమార్తె భౌతిక దాడికి పాల్పడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.

కర్ణాటకలోని మండ్య జిల్లా, శ్రీరంగపట్నం తాలూకా పరిధిలోని ఆరతి ఉక్కడ అహల్యాదేవి ఆలయంలో భీమన అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. పండుగ కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో తుమకూరు గ్రామీణ బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ గౌడ కుమార్తె ఐశ్వర్య నేరుగా గర్భగుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.

క్యూలైన్‌లో ఉన్న వేలాది మంది భక్తులకు ఇబ్బంది కలగకూడదని, రెండు నిమిషాలు ఆగాలని మండ్య మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై బి. సవిత ఐశ్వర్యను కోరారు. నేను ఎమ్మెల్యే కూతుర్ని.. నన్నే ఆపుతావా? అంటూ ఐశ్వర్య ఎస్సైపై తీవ్ర ఆగ్రహంతో రెచ్చిపోయారు. అక్కడే ఉన్న సీఐ లక్ష్మి వారిస్తున్నప్పటికీ వినకుండా, ఎస్సై సవిత చెంప పగలగొట్టి, విధులకు భంగం కలిగిస్తూ తీవ్ర బెదిరింపులకు దిగారు.

ఈ ఘటనపై బాధితురాలు, ఎస్సై సవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్యాతనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఐశ్వర్యపై విధులకు ఆటంకం కలిగించడం, దాడి చేయడం వంటి పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, రాత్రి వేళ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఐశ్వర్య.. ఎస్సై సవితనే తనతో అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొంటూ రివర్స్ ఫిర్యాదు చేయడం విశేషం.

ఎమ్మెల్యే కూతురు మహిళా ఎస్సైపై చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో తీవ్ర ప్రజా గ్రహం వ్యక్తమైంది. ఖాకీ డ్రెస్సులో ఉన్న అధికారిణికి రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నించారు. మరోవైపు విమర్శలు వెల్లువెత్తడంతో ఐశ్వర్య తండ్రి, ఎమ్మెల్యే సురేశ్ గౌడ స్పందించక తప్పలేదు. తన కుమార్తె ప్రవర్తన పట్ల ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. నా కుమార్తె తప్పు చేసి ఉంటే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చు అని పేర్కొన్నారు.

దేవుని ముందు అందరూ సమానులేనని, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఈ వీఐపీ కల్చర్‌ను పూర్తిగా రద్దు చేయాలని వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలను పరిరక్షించే పోలీసులపై వీఐపీల అహంకారం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నకు ఈ ఘటన మరోసారి ఉదాహరణగా నిలిచింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందో లేక కౌంటర్ ఫిర్యాదుల పేరుతో కేసు నీరుగారిపోతుందో వేచి చూడాలి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story