DK Shivakumar: డీకే శివకుమార్ సర్కార్‌కు షాక్.. ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజులకే మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

DK Shivakumar: కర్ణాటకలో డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Arun Chilukuri
Updated on: 5 Jun 2026 11:11 AM IST
DK Shivakumar
X

DK Shivakumar: డీకే శివకుమార్ సర్కార్‌కు షాక్.. ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజులకే మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

DK Shivakumar: కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన డీకే శివకుమార్ (DK Shivakumar) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదిలోనే ఊహించని కుదుపు ఎదురైంది. జూన్ 3న (బుధవారం) క్యాబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సీనియర్ నేత రామలింగారెడ్డి (Ramalinga Reddy).. శుక్రవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తనకు ఇష్టం లేని, ఏమాత్రం అవగాహన లేని నీటిపారుదల శాఖను (Irrigation Ministry) కేటాయించడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆయన మంత్రివర్గం నుండి వైదొలగడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

శాఖల కేటాయింపుల విషయంలో తీవ్ర అసంతృప్తికి గురైన రామలింగారెడ్డి బెంగళూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, మీడియా ముందే తన రాజీనామా లేఖపై సంతకం చేశారు. "నేను ముఖ్యమంత్రిని ఏ శాఖా స్వయంగా అడగలేదు. నగర అభివృద్ధి (Urban Development) శాఖను కేటాయిస్తానని సీఎం డీకే శివకుమారే నాకు హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత దాన్ని మార్చి నీటిపారుదల శాఖను కేటాయించారు. ఇది నాకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. అందుకే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇకపై అధిష్టానం నాకు ఏ మంత్రిత్వ శాఖను ఆఫర్ చేసినా నేను తీసుకోను. అయితే నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, ఎమ్మెల్యేగా కొనసాగుతాను."

జూన్ 3న ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయగా.. ఆయనతో పాటు 13 మందితో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. వారిలో అత్యంత సీనియర్ అయిన రామలింగారెడ్డి ఇలా 48 గంటల్లోనే తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలైన ఈ అంతర్గత సంక్షోభంపై భారతీయ జనతా పార్టీ (BJP) తక్షణమే స్పందించింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ పరిణామాలపై వ్యాఖ్యానిస్తూ.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మున్ముందు మరింత పెరుగుతాయని జోస్యం చెప్పారు. కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చడం వల్ల ఆ పార్టీకి వచ్చే లాభం ఏమీ లేదని ఎద్దేవా చేశారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టింది. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, రామలింగారెడ్డి తమ పార్టీకి, రాష్ట్రానికి అత్యంత కీలకమైన నేత అని, ఆయనను బుజ్జగిస్తామని ప్రకటించింది.

కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం డీకే శివకుమార్‌కు అంత సులువు కాదని, ఆయన ముందు అనేక రాజకీయ సవాళ్లు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. క్యాబినెట్‌లో విభిన్న సామాజిక వర్గాలు, సీనియర్ నేతలకు సమప్రాధాన్యం దక్కేలా చూసుకోవడం డీకేకు ఒక పెద్ద పరీక్ష.

సిద్ధరామయ్యను (Siddaramaiah) సీఎం పదవి నుంచి తప్పించడంతో కాంగ్రెస్‌కు ఉన్న సంప్రదాయ ‘అహింద’ (AHINDA - మైనారిటీ, వెనుకబడిన తరగతులు, దళితులు) ఓటుబ్యాంకు దూరం కాకుండా చూసుకుంటూనే.. తన సొంత సామాజిక వర్గమైన ‘ఒక్కలిగ’లను పార్టీ వైపు తిప్పుకోవడం మరో సవాలు.

నాయకత్వ మార్పు సాఫీగా సాగినట్లు పైకి కనిపిస్తున్నా.. అంతర్గతంగా సీఎల్పీ (CLP) సమావేశంలో శాసనసభాపక్ష నేతగా శివకుమార్‌ పేరును ప్రతిపాదించడానికి సిద్ధరామయ్య తొలుత తీవ్రంగా నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను బట్టి చూస్తే సీఎం డీకే రాబోయే రోజుల్లో సొంత పార్టీలోనే గట్టి ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story