CM Vijay: మాట నిలబెట్టుకున్న దళపతి: కరూర్ బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన సీఎం విజయ్
CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా తొలిసారి కరూర్‌లో పర్యటించిన దళపతి విజయ్.. నాటి తొక్కిసలాట ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ‘కరూర్ తొక్కిసలాట’ (Karur Stampede) కచ్చితంగా రాజకీయ కుట్రేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం హోదాలో తొలిసారిగా కరూర్‌లో పర్యటించిన ఆయన.. నాటి ఘోర విషాదాన్ని గుర్తుచేసుకుంటూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. రద్దీని నియంత్రించగలరని తాను పోలీసులను నమ్మితే.. నాటి ఘటనకు తననే బాధ్యుడిని చేస్తూ ప్రత్యర్థులు బురదజల్లారని ఆవేదన వ్యక్తం చేశారు.
కరూర్ సభలో సీఎం విజయ్ మాట్లాడుతూ.. “ఒక మనిషి ఉన్నత శిఖరాలను అధిరోహించినా, జీవితంలో ఎక్కడో ఓ చోట తీవ్రమైన బాధను అనుభవించక తప్పదు. నా రాజకీయ ప్రయాణంలో కరూర్ ఘటన అలాంటిదే. ఆ రోజు ర్యాలీకి జనం భారీగా వచ్చారని తెలిసినప్పుడు పోలీసులు మమ్మల్ని అలర్ట్ చేయాల్సింది, లేదా ఆ ప్రోగ్రామ్‌ను రద్దు చేయాల్సింది. వారికి ఆ హక్కులు ఉన్నాయి కదా! కానీ వారు చోద్యం చూశారు. బహుశా అలా చేయమని నాటి అధికార పక్షం (డీఎంకే) నుంచి వారిపై ఒత్తిడి ఉండి ఉండవచ్చు” అని ఆరోపించారు.
ఘటన జరిగిన తర్వాత తాను పారిపోయానని ప్రత్యర్థులు ప్రచారం చేశారని, కానీ తాను ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని విజయ్ స్పష్టం చేశారు. మృతుల జ్ఞాపకార్థం పార్టీ తరఫున ఒక శాశ్వత స్మారకాన్ని నిర్మిస్తామని వెల్లడించారు.
ఇదే వేదికపై నుంచి తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇటీవల ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలపై విజయ్ ఘాటుగా స్పందించారు. డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK)లను ఉద్దేశిస్తూ పరోక్ష విమర్శలు గుప్పించారు. “ప్రజలు నా వైపే ఉన్నారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా మమ్మల్ని అధికారంలో నుంచి దించలేరు. గత ప్రభుత్వాలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డాయి. కానీ మా హయాంలో ఒక్క పైసా లంచం లేకుండా నిజాయతీగా ప్రజలకు సేవలందిస్తున్నాం” అని ధీమా వ్యక్తం చేశారు.
గతేడాది అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కరూర్‌లో టీవీకే పార్టీ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న విజయ్.. తాను అధికారంలోకి రాగానే మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. సీఎం అయిన తర్వాత చెప్పిన మాట ప్రకారమే.. ఈ కరూర్ పర్యటనలో బాధిత కుటుంబాలలోని అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా అందజేశారు.




