Kerala Governor: కేరళ రాజ్‌భవన్‌లో శాకాహార వివాదం: గవర్నర్ నిర్ణయంపై మండిపడుతున్న కాంగ్రెస్, సీపీఎం!

Kerala Governor: కేరళ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన ఓం ప్రకాష్ మాథుర్ రాజ్‌భవన్‌లో వెజ్ కిచెన్ మాత్రమే ఉండాలన్న నిర్ణయంపై వివాదం చెలరేగింది. దీనిపై కాంగ్రెస్, సీపీఎం మండిపడుతున్నాయి.

Arun Chilukuri
Published on: 24 Oct 2026 4:30 PM IST
Kerala Governor
X

Kerala Governor: కేరళ రాజ్‌భవన్‌లో శాకాహార వివాదం: గవర్నర్ నిర్ణయంపై మండిపడుతున్న కాంగ్రెస్, సీపీఎం!

Kerala Governor: కేరళ నూతన గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన ఓం ప్రకాష్ మాథుర్ ప్రమాణ స్వీకారం చేసిన ఒక్క రోజు కూడా గడవకముందే తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌లో కేవలం శాకాహార వంటశాల (వెజ్ ఓన్లీ కిచెన్) మాత్రమే ఉండాలంటూ ఆయన తీసుకున్న నిర్ణయం కేరళ రాజకీయాల్లో పెద్ద కలకలమే రేపుతోంది. ఈ నిబంధనపై కాంగ్రెస్, సీపీఎం పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

ఓం ప్రకాష్ మాథుర్ కేరళ గవర్నర్‌గా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బాధ్యతలు చేపట్టిన రోజే ఆయన రాజ్‌భవన్‌లో ఇకపై శాకాహారం మాత్రమే వండాలని, మాంసాహారాన్ని వండటం గానీ, వడ్డించడం గానీ చేయకూడదని సిబ్బందిని ఆదేశించారు. గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయంపై కేరళలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆహారపు అలవాట్ల విషయంలో వ్యక్తిగత స్వేచ్ఛను, రాజ్యాంగ హక్కులను హరించేలా గవర్నర్ నిర్ణయం ఉందని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి.

ఈ అంశంపై కేరళకు చెందిన కాంగ్రెస్ అగ్రనేత, పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తీవ్రంగా స్పందించారు. గవర్నర్ తన వ్యక్తిగత ఆహారపు అలవాట్లను, అభిరుచులను అందరిపై రుద్దడం సరికాదన్నారు. కేరళకు సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, ఇక్కడి ప్రజలు చేపలను, ఇతర మాంసాహారాన్ని ఎక్కువగా తింటారని గుర్తుచేశారు. ప్రజలకు నచ్చిన ఆహారాన్ని తినే ప్రాథమిక హక్కు ఉందని, దానిని నిషేధించే చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించబోమని స్పష్టం చేశారు. గవర్నర్ తన పదవిని ప్రజల హక్కుల రక్షణ కోసం కాకుండా, సొంత నిబంధనలను అమలు చేయడానికి వాడుకోవడం సరికాదన్నారు.

మరోవైపు, ఈ వివాదంపై కేరళ రాజ్‌భవన్‌ వర్గాలు స్పందించాయి. గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు కేవలం ఆయన వ్యక్తిగత భోజనం కోసం సిద్ధం చేసే ఆహార పదార్థాలకు మాత్రమే వర్తిస్తాయని, రాజ్‌భవన్‌ ఉద్యోగులు లేదా ఇతర సిబ్బందికి కాదని స్పష్టతనిచ్చాయి. అయినప్పటికీ, కేరళలో ఈ అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.