Nipah Virus: కేరళంలో నిఫా వైరస్ కలకలం.. 200 మందికిపైగా..
Nipah Virus: కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ (Nipah Virus) శరవేగంగా విస్తరిస్తోంది. అక్కడ ఇప్పటికే రెండు వందల మందికి పైగా ఈ ప్రాణాంతక వైరస్ బారిన..
Nipah-Virus
Nipah Virus: కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ (Nipah Virus) శరవేగంగా విస్తరిస్తోంది. అక్కడ ఇప్పటికే రెండు వందల మందికి పైగా ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడినట్లు సమాచారం రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. కేరళలో పరిస్థితి రోజురోజుకూ తీవ్రమవతుండటంతో పక్కనే ఉన్న తమిళనాడు ప్రభుత్వం తీవ్ర అప్రమత్తమైంది. కేరళ సరిహద్దుల గుండా తమ రాష్ట్రంలోకి వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు స్టాలిన్ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేసింది.
చికిత్సలో కీలక పరిణామం.. రోగికి రెమ్డెసివిర్ డోస్
వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించే ప్రక్రియలో కేరళ వైద్య ఆరోగ్య శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కోజికోడ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో నిఫా వైరస్‌తో ప్రాణాపాయ స్థితిలో పోరాడుతున్న 43 ఏళ్ల ఒక రోగికి ఆదివారం ఉదయం యాంటీవైరల్ డ్రగ్ 'రెమ్డెసివిర్' (Remdesivir) మొదటి డోస్‌ను వైద్యులు విజయవంతంగా అందించారు. గతంలో కరోనా సమయంలో ప్రాణాలు కాపాడటంలో కీలక పాత్ర పోషించిన ఈ డ్రగ్‌ను, ఇప్పుడు నిఫా తీవ్రతను తగ్గించడానికి ప్రయోగాత్మకంగా ఇస్తున్నారు. ఈ చికిత్స గనుక ఆశించిన ఫలితాన్ని ఇస్తే, నిఫా బారిన పడిన మరికొంతమంది బాధితులకు కూడా దీని ద్వారా నయం చేయవచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం సదరు రోగి పరిస్థితిని నిపుణులైన డాక్టర్ల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది.
తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్
కేరళకు ఆనుకుని ఉన్న తమిళనాడు సరిహద్దు జిల్లాలైన కోయంబత్తూర్, తేని, కన్యాకుమారితో పాటు కడలూరు జిల్లాల వైద్య ఆరోగ్య శాఖలను తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆయా జిల్లాల సరిహద్దుల వద్ద ప్రత్యేక నిఘా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేరళ నుంచి తమ రాష్ట్రంలోకి ప్రవేశించే అన్ని రకాల వాహనాలను, ప్రయాణికులను చెక్‌పోస్టుల వద్ద అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
రంగంలోకి వైద్య బృందాలు.. మెడికల్ క్యాంపులు
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో తమిళనాడు అధికారులు ప్రత్యేక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి నిఫా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నట్లు అనుమానం వస్తే.. వారిని వెంటనే ఈ మెడికల్ క్యాంపులకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద 24 గంటల పాటు డాక్టర్లు, నర్సులు, విద్యా సిబ్బంది షిఫ్టుల వారీగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
ముందస్తు జాగ్రత్తలపై తమిళనాడు సర్కార్ ఫోకస్
కేరళలో రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో తమిళనాడు వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందకుండా ప్రభుత్వం పలు జాగ్రత్తలు, సూచనలు జారీ చేసింది. అడవి గబ్బిలాలు, ఇతర జంతువులు కొరికిన పండ్లను అస్సలు తినవద్దని, తోటల్లో కిందపడిన పండ్లను ముట్టుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. సరిహద్దు జిల్లాల ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను, అవసరమైన మందులు, పీపీఈ కిట్లను సిద్ధంగా ఉంచినట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, మాస్కులు ధరించి అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.




