Kerala Tragedy: ఒక్క రాత్రిలోనే అంతా ముగిసింది.. కేరళలో కలిచివేసిన ఘటన.!
Kerala Tragedy: కేరళలోని పిరవం సమీపంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
tragedy suicide
Kerala Tragedy: కేరళలోని పిరవం సమీపంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆదివారం ఉదయం ఏడేళ్ల చిన్నారి మృతదేహం కూడా లభ్యం కావడంతో.. నదిలో గాలింపు చర్యలు ముగిశాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆ కుటుంబం ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఒకరి తర్వాత ఒకరిగా లభ్యమైన మృతదేహాలు
పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం పిరవం నదిలో మొదట ఒక మహిళ, రెండేళ్ల బాలుడి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని కోతమంగళంలో అద్దె ఇంట్లో నివసిస్తున్న విజి (దృష్టి లోపం ఉన్న మహిళ), ఆమె రెండేళ్ల కుమారుడిగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత విజి భర్త నారాయణన్, వారి ఏడేళ్ల కుమార్తె కూడా కనిపించకుండా పోవడంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. శనివారం నాడు భర్త నారాయణన్ మృతదేహం నదిలో లభించగా, చిన్నారి కోసం శనివారం రోజంతా వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు ఆదివారం ఉదయం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మళ్లీ గాలింపు చేపట్టగా, నదిలోనే ఆ ఏడేళ్ల చిన్నారి మృతదేహం కూడా లభ్యమైంది.
అద్దె కట్టలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు
మృతుడు నారాయణన్ పాలక్కాడ్‌కు చెందినవాడు కాగా, కోతమంగళంలో ఒక అద్దె ఇంట్లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే, గత కొంతకాలంగా వీరు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చివరకు ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితి రావడంతో.. ఇటీవల నారాయణన్ కుటుంబం సహాయం కోసం కోతమంగళం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు మానవత్వంతో స్పందించి వారికి మరో ప్రత్యామ్నాయ వసతిని కూడా ఏర్పాటు చేశారు. ఆదివారం నాడే ఆ కొత్త ఇంటికి ఈ కుటుంబం మారాల్సి ఉంది. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది.
సీసీటీవీ ఫుటేజ్ లభ్యం.. కేసు నమోదు
ఆత్మహత్యకు ముందు గురువారం నాడు ఈ కుటుంబం పిరవంలోని ఒక హోటల్‌లో కలిసి భోజనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతుల బంధువుల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. ఆదివారం నాటికి నలుగురి మృతదేహాలకు పోస్ట్‌మార్టం ప్రక్రియ పూర్తి చేసి బంధువులకు అప్పగించనున్నారు. కొత్త జీవితం ప్రారంభించాల్సిన రోజే నలుగురూ శవాలుగా మారడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.




