Kerala Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది విద్యార్థులు దుర్మరణం!

Kerala Road Accident: కేరళలోని త్రిసూర్ జిల్లా కైపమంగళం వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Gagan kumar
Published on: 5 Sept 2026 8:10 AM IST
Kerala Road Accident
X

Kerala Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది విద్యార్థులు దుర్మరణం!

Students Dead Kerala: కేరళలో పెను విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాద రూపంలో వచ్చిన మృత్యువు, నింగికెగయాల్సిన యువ కెరటాలను చిదిమేసింది. ఆరిపోని ఆశలతో, ఉజ్వల భవిష్యత్తు కలలతో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది విద్యార్థుల జీవితాలు ఒక్క క్షణంలో అనంత వాయువుల్లో కలిసిపోయాయి.

త్రిసూర్ జిల్లా కైపమంగళం సమీపంలోని పనమ్బిక్కున్ను వద్ద శుక్రవారం అర్ధరాత్రి వేళ ఈ దారుణ ఘటన జరిగింది. గురువాయూర్ దర్శనం ముగించుకుని కొడుంగల్లూరు వైపు వేగంగా దూసుకెళ్తున్న ఒక కారు, జాతీయ రహదారిపై నిలిపి ఉన్న లారీని తీవ్రస్థాయిలో ఢీకొట్టింది.

ప్రమాద ధాటికి అభాగ్యులైన ఎనిమిది మంది విద్యార్థులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కారు అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన తీరు ప్రత్యక్ష సాక్షులను సైతం వణికించింది. ఢీకొట్టిన తీవ్రతకు కారు భాగాలన్నీ నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులు కారు శిథిలాల మధ్య ఇరుక్కుపోవడంతో, కట్టర్ల సాయంతో వాహన భాగాలను కట్ చేసి మృతదేహాలను బయటకు తీయాల్సి వచ్చింది.

ప్రమాదానికి గురైన వాహనం తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో ఉండటంతో, మృతులంతా పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన విద్యార్థులుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం త్రిస్సూర్ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితుల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. పరిమితికి మించిన వేగం, నిర్లక్ష్యం ఎంతటి శోకాన్ని మిగులుస్తాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story