UAE Lottery : దుబాయ్ లాటరీలో కేరళ వ్యక్తికి రూ.78 కోట్ల జాక్‌పాట్.. రాత్రికి రాత్రే మారిన టెక్నీషియన్ తలరాత
UAE Lottery : యూఏఈ లాటరీలో కేరళకు చెందిన టెక్నీషియన్ సునీల్‌కుమార్ సదాశివన్ రూ.78 కోట్ల (3 కోట్ల ఏఈడీ) బంపర్ జాక్‌పాట్ గెలుచుకున్నారు.
Sunil Kumar Sadasivian
UAE Lottery : అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. యూఏఈలో మెయింటెనెన్స్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న కేరళకు చెందిన 52 ఏళ్ల సునీల్‌కుమార్ సదాశివన్‌ను లక్ష్మీదేవి వరించింది. ఇటీవల జరిగిన యూఏఈ అధికారిక లాటరీ డ్రాలో సునీల్‌కుమార్ ఏకంగా 3 కోట్ల ఏఈడీ (AED), అంటే భారతీయ కరెన్సీలో సుమారు 78 కోట్ల రూపాయల భారీ జాక్‌పాట్‌ను సొంతం చేసుకున్నారు. ఈ భారీ మొత్తాన్ని గెలుచుకున్న సునీల్.. యూఏఈ లాటరీ చరిత్రలోనే ఈ స్థాయి గ్రాండ్ ప్రైజ్ సాధించిన మూడో వ్యక్తిగా నిలిచారు. ఈ టికెట్‌ను ఆయన తన స్నేహితుడితో కలిసి భాగస్వామ్యంలో కొనడం విశేషం.
అయితే ఈ లాటరీ నంబర్లను ఎంచుకోవడంలో సునీల్‌కుమార్ ఒక వినూత్నమైన, సెంటిమెంట్ పంథాను అనుసరించారు. ఏవో యాదృచ్ఛిక నంబర్లను కాకుండా, తన జీవితంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన తేదీలనే లక్కీ నంబర్లుగా మార్చుకున్నారు. మొదట తన ఏడేళ్ల చిన్నారి కుమార్తె పుట్టినరోజు, ఆ తర్వాత తన పుట్టినరోజు, చివరగా భార్య పుట్టినరోజు తేదీల ఆధారంగా లాటరీ నంబర్లను ఎంపిక చేసుకున్నారు. కుటుంబ సభ్యులపై ఉన్న ప్రేమే ఈరోజు ఆయనను కోటీశ్వరుడిని చేసింది. ఈ గెలుపునకు కేవలం ఒక వారం ముందే ఈ స్నేహితుల జోడీకి 100 ఏఈడీల చిన్న లాటరీ బహుమతి కూడా రావడం గమనార్హం.
డ్యూటీ ముగించుకుని రూమ్‌కు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సునీల్ తన మొబైల్‌లో లాటరీ ఫలితాలను తనిఖీ చేశారు. రాత్రి 9:45 గంటల ప్రాంతంలో కనీసం ఒక 100 ఏఈడీలయినా గెలుచుకున్నానా లేదా అని చూసిన ఆయనకు, విన్నింగ్ నంబర్ల లిస్ట్‌లో తన నంబర్ కనిపించేసరికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. తాను ఏకంగా రూ.78 కోట్లు గెలిచాననే విషయాన్ని నమ్మలేక పక్కనే ఉన్న స్నేహితుడికి టికెట్ చూపించారు. ఆ తర్వాత కాస్త కోలుకుని వెంటనే కేరళలో ఉన్న తన భార్యకు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఎప్పుడూ సాధారణ జీవితాన్ని ఇష్టపడే ఆమె, అంతటి భారీ మొత్తాన్ని వినగానే ఆనందంలో మునిగిపోయి, ఈ డబ్బుతో ఏం చేద్దామని భర్తను అడిగింది.
ఈ అపారమైన సంపదతో సునీల్‌కుమార్ తన జీవితంలోనే అతిపెద్ద కలలను నెరవేర్చుకోబోతున్నారు. పెళ్లయిన పదేళ్ల వరకు పిల్లలు కలగకపోవడంతో ఎంతో ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకున్న తర్వాత ఈ దంపతులకు కుమార్తె జన్మించింది. అందుకే తన కూతురంటే సునీల్‌కు ప్రాణం. "నా కూతురిని బాగా చదివించి, భవిష్యత్తులో ఒక గొప్ప డాక్టర్‌గా చూడటమే నా జీవిత ఆశయం. ఈ డబ్బులు చేతికి రాగానే మొదట నా కూతురికి ఒక మంచి గిఫ్ట్ కొంటాను" అని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
చిన్న వయసు నుంచే కష్టపడటం అలవాటైన సునీల్, ఇకపై ఉద్యోగానికి స్వస్తి చెప్పి కాస్త విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ నగదుతో కేరళలోని తన సొంతూరికి వెళ్లి సగం పూర్తయిన తన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. అనంతరం అక్కడ ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించనున్నారు. తాము ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినందున, సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఈ దంపతులు నిర్ణయించుకున్నారు. తమ గ్రామంలో ఇళ్లు లేని పేద ప్రజలు కొంతమంది ఉన్నారని, వారికి ఉచితంగా ఇళ్లను నిర్మించి ఇస్తానని, అలాగే పేద పిల్లల చదువులకు సహాయం అందిస్తానని సునీల్ తన ఉదారత్వాన్ని చాటుకున్నారు.
2024 డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ యూఏఈ లాటరీలో ఇప్పటివరకు గెలిచిన ముగ్గురు విజేతలూ అబుదాబిలో నివసిస్తున్న వారే కావడం విశేషం. అంతకుముందు 2025 అక్టోబర్‌లో అనిల్‌కుమార్ బొల్లా అనే భారతీయుడు ఏకంగా 100 మిలియన్ ఏఈడీల (సుమారు రూ.220 కోట్లు) రికార్డు బహుమతిని ఒంటరిగా గెలుచుకోగా, మే 2026 లో నేపాల్‌కు చెందిన సెక్యూరిటీ గార్డ్ తయాబ్ ఖాన్ తన ఐదుగురు స్నేహితులతో కలిసి 30 మిలియన్ ఏఈడీల జాక్‌పాట్ కొట్టారు. ఇప్పుడు సునీల్‌కుమార్ రూపంలో మరో భారతీయుడికి ఈ జాక్‌పాట్ దక్కడం విశేషం.




