Stampede: దుర్గా మాత మండపం వద్ద తొక్కిసలాట.. 20 మంది మృతి
Stampede: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో భారీ విషాదం చోటుచేసుకుంది.
Kolkata Stampede
Stampede: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో భారీ విషాదం చోటుచేసుకుంది. ప్రసిద్ధ చోర్బాగన్ సర్వజనీన్ దుర్గా మాత మండపం వద్ద అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన జనసందోహంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ భయానక ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఎక్కువ మంది మహిళలే ఉండటం అందరినీ కలచివేసింది. ఈ ఘటనలో మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే మెడికల్ కాలేజ్ ఆసుపత్రి, ఎన్ఆర్ఎస్ అలాగే ఆర్జీ కర్ ఆసుపత్రులకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణ ఘటనతో రాష్ట్రంలో పండుగ శోభ కాస్తా ఒక్కసారిగా విషాదంగా మారింది.
అధికారులు, పోలీసు యంత్రాంగం మృతుల వివరాలను సేకరించి షాకింగ్ నిజాలను బయటపెట్టారు. మరణించిన 20 మందిలో ఇప్పటివరకు ఆరుగురిని గుర్తించారు. శ్రీపర్ణా పోద్దార్ (27), ఆర్తి సర్కార్ విశ్వాస్, ప్రియా సమద్దర్, మిథూ పాల్, తానియా విశ్వాస్ అలాగే స్థానికుడైన శుభమ్ సోంకర్లుగా వారిని నిర్ధారించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పండల్లో రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో మైక్లో వచ్చిన ఒక ప్రకటన కారణంగా జనాల్లో తీవ్ర ఆందోళన చెలరేగింది. చీకటి, వర్షం అలాగే ఇరుకైన దారి కారణంగా పండల్ ఒకవైపు ఒరిగిపోవడంతో భయంతో పరుగులు తీసిన జనం ఒకరిపై ఒకరు పడిపోయారు. తగినన్ని అత్యవసర వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ దారుణ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. వెంటనే ఉన్నతాధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని, ఆసుపత్రులను సందర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన చోర్బాగన్ పూజా కమిటీకి చెందిన ఐదుగురు ప్రధాన అర్చకులతో సహా మొత్తం 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపేందుకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సహాయంతో పాటు కుటుంబంలో ఒకరికి గ్రూప్-డి ఉద్యోగం ఇస్తామని సీఎం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించి, ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
ఈ విషాద వార్త తెలియగానే కేంద్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కోల్కతా పర్యటనకు రావలసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన బెలూర్ మఠం పర్యటనతో సహా అన్ని అధికారిక, బహిరంగ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఆయన నేడు నేరుగా ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్ర సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించడంతో పాటు పీఎం కేర్స్ ఫండ్ నుంచి సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఎలాంటి రాజకీయాలకు తావు ఇవ్వకుండా అందరూ బాధితులకు అండగా నిలవాలని, పండల్స్ నిర్వాహకులు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.




